Andhra PradeshHome Page Slider

నువ్వా-నేనా.. సీఎం పీఠం ఎవరికి?

Share with

• వ్యూహ ప్రతి వ్యూహాల్లో పార్టీ అధినేతల బిజీబిజీ
• ద్వితీయ శ్రేణి నాయకుల వైపు వైయస్ జగన్ చూపు
• ఎన్నికల్లో విజయం సాధించి సీఎం స్థానంలో కూర్చోవడానికి చంద్రబాబు తహతహ
• నియోజకవర్గ ఇన్చార్జిల మార్పులపై చంద్రబాబు కసరత్తులు

ఏపీలో ఎన్నికలకు ఏడాదికిపైగా ఉన్నప్పటికీ ఎక్కడ చూసినా రాజకీయ సందడి కనిపిస్తోంది. రాబోయే ఎన్నికల్లో అధికార పీఠాన్ని కైవసం చేసుకోవటానికి పార్టీల అధినేతలు వైయస్ జగన్ చంద్రబాబు నాయుడులు ఎవరి జాగ్రత్తలు వారు పడుతూ వ్యూహ ప్రతి వ్యూహాల్లో బిజీబిజీగా గడుపుతున్నారు. రాబోయే ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోవడానికి చంద్రబాబు నాయుడు తహతహలాడుతున్నారు. అలానే వైయస్ జగన్ కూడా తిరిగి అధికారం పొందటానికి పావులు కదుపుతున్నారు. ఇప్పటికే తన జట్టులో ధిక్కారస్వరాలు ఎక్కువ అవుతున్నాయని గ్రహించి ద్వితీయ శ్రేణి నాయకత్వంతో మాట్లాడటానికి ప్రణాళికలు రచిస్తున్నారు. ఇక ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు కూడా ఈసారి అధికారంలోకి రాకపోతే ఆ తర్వాత చేసేదేమీ లేదని రీతిలో ఉన్నారు.

2014లో పాదయాత్ర ద్వారా ఇచ్చిన హామీలతో జనం వద్ద ఓట్లు సంపాదించి చంద్రబాబు సీఎం అయ్యారు. ఆ తర్వాత కాలంలో ఆయన వ్యవహారం నచ్చని ప్రజలు జగన్‌ను సీఎంగా చేశారు. చంద్రబాబును అతి ఘోరంగా ఓడించారు. గుణపాఠం నేర్చుకున్న చంద్రబాబు రాబోయే ఎన్నికల నాటికి తన పార్టీని కొంత ప్రక్షాళన చేసి అధికారంలోకి రావటానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో 175 కు 175 సీట్లు సాధించి తీరుతామని దేవుని దయ ప్రజల అభిమానం ఉంటే చాలని ఇంకెవరు అంతగా అవసరం లేదనే అర్థం వచ్చేలా జగన్ తన భారీ బహిరంగ సభల్లో ప్రకటించేవారు కానీ తన జట్టులో ఈ మధ్యకాలంలో ధిక్కారస్వరాలు కలవరపెడుతున్నాయి. నెల్లూరు జిల్లాతో మొదలైన రాజకీయ పరిణామాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కంటిలో నలుసులా తయారయ్యాయి. ఎన్నికలు దగ్గర పడే కొద్ది తమ పార్టీ అధినేతపై ఎమ్మెల్యేల మనసులో గూడు కట్టుకొని ఉన్న విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అవి తట్టుకోవడానికి జగన్ సిద్ధంగా ఉండే ప్రయత్నాలు చేసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో ప్రతి జిల్లా పై ఫోకస్ పెట్టి అనుమానాలు కలిగిన నియోజకవర్గంలో ద్వితీయ శ్రేణి నాయకులతో సంబంధాలు పెంచుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కానీ జగన్ సీఎం అయి మూడేళ్లు దాటిన ఎప్పుడైనా ఆయనను కలవాలంటే ఎమ్మెల్యేలకే అపాయింట్మెంట్ దొరికేది కాదని ఇక తాము కలవడం కుదిరే పని కాదని గత మూడు సంవత్సరాలుగా ద్వితీయ శ్రేణి నాయకులు కార్యకర్తలు మాట్లాడుకుంటూ ఉండేవారు. ఇప్పుడు ఎన్నికల దగ్గర పడే కొద్ది తమ అవసరం జగన్ కు కనిపించిందా అని వారు మాట్లాడుకుంటున్నారు. జగన్ సీఎం అయితే తమ బతుకులు కూడా బాగుపడతాయని ఆశించిన చోటామోటా నాయకులు ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు ఈ మూడేళ్లు నిరుత్సాహంతోనే కాలం గడిపారు. కానీ ఇప్పుడు జగన్ కు ఒక్కసారిగా తాము గుర్తొచ్చామా అని పెదవి విరుస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ కు ద్వితీయ శ్రేణి నాయకులు ఏ మేరకు స్పందిస్తారో చూడాల్సి ఉంది.

అలానే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలంటే కొన్ని మార్పులు చేర్పులు చేయక తప్పదని భావించిన చంద్రబాబు ఆ మేరకు ఏపీలో బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో ఉన్న ఇంచార్జిలను మారుస్తూ వస్తున్నారు. ఈ మధ్యకాలంలో నలుగురు ఇన్చార్జిలను మార్చిన చంద్రబాబు మరొక పదిమందికి పైగా ఇన్చార్జిలను మార్చటానికి కసరత్తులు చేస్తున్నారు. ఇలా ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో అటు అధికార పార్టీ ఇటు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతలు ఇద్దరు తీసుకుంటున్న నిర్ణయాలతో నియోజకవర్గస్థాయి నాయకులులో కలవరం మొదలైంది. మరి ఎవరి వ్యూహాలు ఫలించి రాబోయే ఎన్నికల్లో అధికారం కైవసం చేసుకుంటారో చూడాలి.