Home Page SliderNational

ప్రమాదస్థాయిని దాటి ఉప్పొంగుతున్న యమునా నది..ఢిల్లీలో రెడ్ అలర్ట్

Share with

ఉత్తర భారతదేశంలో జలప్రళయం కొనసాగుతోంది. గత కొన్నిరోజులుగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఉత్తరాధిలోని నదులకు భారీగా వరద నీరు చేరి ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కాగా అధికారులు ఎగువ నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ క్రమంలో ఢిల్లీలోని యమునా నదికి భారీగా వరద నీరు చేరింది. ఈ వరద నీటితో యమునా నది ఇప్పటికే ప్రమాదస్థాయిని(205.33 మీటర్లు) దాటి ఉప్పొంగి ప్రవహిస్తుంది. కాగా ఈ రోజు ఉదయం 6 గంటలకు ఢిల్లీలోని పాత రైల్వే వంతెన వద్ద ఈ నది నీటి మట్టం 206.28 మీటర్లుకు చేరింది. అయితే ఇవాళ సాయంత్రానికి ఈ నీటి మట్టం మరింత పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.

అయితే నది ఉధృతితో ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలు ఇప్పటికే నీట మునిగాయి. దీంతో ఢిల్లీ పాలనాయంత్రాగం అప్రమత్తమైంది. ఈ మేరకు యమునా నది పరిసరాల్లో ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియను గత రాత్రి నుంచే అధికారులు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో అధికారులు ఢిల్లీలో రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఢిల్లీ వాసులు అవసరమైతేనే తప్ప బయటకు రావొద్దని సూచించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని పాఠశాలలకు ప్రభుత్వం ఇప్పటికే సెలవులు ప్రకటించింది.