Home Page SliderTelangana

పార్టీ ఫిరాయింపులు ఉపఎన్నికలకు దారి తీస్తాయా?..కాంగ్రెస్ సిద్దమేనా?

Share with

బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌కు ఢిల్లీలో కళ్లు, చెవులుగా చెప్పుకునే రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు తన ఎంపీ పదవికి రాజీనామా చేయడం కలకలం రేపుతోంది. ఆయన నిజాయితీగా రాజకీయాలు చేస్తానని ప్రకటించుకుని, బీఆర్‌ఎస్ ద్వారా వచ్చిన రాజ్యసభ పదవిని వదులుకున్నారు. నేడు ఉపరాష్ట్రపతి జయదీప్ ధన్కడ్‌ను కలిసి రాజీనామా లేఖను అందజేశారు. కాంగ్రెస్‌లోకి వరుసగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు వలసలు వస్తుండడం తెలిసిందే. అయితే కేశవరావును పదవికి రాజీనామా చేయించినా పెద్ద నష్టం లేదు. అసెంబ్లీలో తనకున్న ఎమ్మెల్యేల బలంతో మళ్లీ ఆయనను రాజ్యసభ సభ్యునిగా చేయగలదు కాంగ్రెస్ పార్టీ. కానీ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పలువురు కాంగ్రెస్‌లోకి చేరడం వల్ల పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి మళ్లీ ప్రజాతీర్పును అడగమని బీఆర్‌ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. దీనికి కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారా? అనే చర్చలు మొదలయ్యాయి.

బీఆర్‌ఎస్ పార్టీ పేరుమీద, కేసీఆర్ పేరుతో ఎమ్మెల్యేలుగా గెలిచిన కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్, కాలె యాదయ్యలు కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఇటీవల ఈ ఫిరాయింపుల విషయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్లు కూడా ఆగ్రహం తెచ్చుకున్నారు. సంజయ్ కాంగ్రెస్‌లోకి రావడం పట్ల సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అలుక పూని, రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మళ్లీ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బుజ్జగింపులతో దిగి వచ్చారు. మంత్రి పదవులు ఆశ చూపి కొందరిని, కేసుల భయం చూపి కొందరిని కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకుంది. లోక్ సభ ఎన్నికలు పూర్తి కాగానే పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి, కాంగ్రెస్ గేట్లు తెరిచింది. ఒక వేళ పార్టీ ఫిరాయింపుల చట్టం కింద ఈ ఎమ్మెల్యేలపై వేటు పడితే తమ ఎమ్మెల్యే పదవి కూడా ఊడుతుందనే భయం వారిని వెంటాడుతోంది. అలాగని ఎమ్మెల్యేగా రాజీనామా చేసి, మళ్లీ ఎన్నికలకు వెళ్లి గెలవగలమనే ఆత్మవిశ్వాసం వారికీ లేదు, కాంగ్రెస్ పార్టీకి లేదని తెలుస్తోంది. కేశవరావుతో రాజీనామా చేయించినట్లుగా తమను కూడా ఎక్కడ రాజీనామా చేయమంటారో అనే ఆందోళన వారిని వెన్నాడుతోంది. రేపో మాపో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని ప్రచారం జరుగుతోంది. దీనిని అక్కడి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన సరిత తిరుపతయ్య తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఒకవేళ వీరిపై ఫిరాయింపుల చట్టం ప్రకారం అనర్హత వేటు పడితే సొంత నియోజక వర్గంలో ప్రజల తిరుగుబాటును కూడా ఎదుర్కొని తిరిగి గెలవడం చాలా కష్టమైన పని అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.