InternationalNews

సల్మాన్‌ రష్డీపై ఎందుకింత కసి?.. వివాదమేంటి?

Share with

ప్రముఖ రచయిత సల్మాన్‌ రష్డీపై హత్యాయత్నం ఎందుకు జరిగింది? ఆయనను చంపాలన్న కసి ఎవరికి పుట్టింది? ఆయన వివాదాస్పద రచయితగా మారడానికి కారణమేంటి? ఈ ప్రశ్నలకు సమాధానం వెతకాలంటే 34 ఏళ్లు వెనక్కి వెళ్లాల్సిందే. 1988లో ఆయన రచించిన ది సటానిక్‌ వర్సెస్‌ అనే నవల ఈ దురాఘాతానికి కేంద్ర బిందువు. జూన్‌ 19, 1947న ముంబైలోని ఓ కశ్మీరీ కుటుంబంలో జన్మించిన సర్‌ అహ్మద్‌ సల్మాన్‌ రష్డీ (75) 14 ఏళ్ల వయసులోనే బ్రిటన్‌కు వలస వెళ్లారు. 1964లో బ్రిటన్‌ పౌరసత్వాన్ని పొందారు. 1968లో కేంబ్రిడ్జి యూనివర్సిటీకి చెందిన కింగ్స్‌ కాలేజీ నుంచి ఎంఏ పూర్తి చేశారు.

మిడ్‌నైట్‌ చిల్ట్రన్‌ నవల

మిడ్‌నైట్‌ చిల్డ్రన్‌కు బుకర్‌ ప్రైజ్‌

రష్డీ మొదటి నవల గ్రైమస్‌ 1975లో ప్రచురితమైంది. 1981లో రచించిన మిడ్‌ నైట్‌ చిల్డ్రన్‌ అనే రెండో నవలకు ప్రఖ్యాత బుకర్‌ ప్రైజ్‌ లభించింది. అది 1947 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్య్రం వచ్చిన అర్ధరాత్రి అవిభక్త భారత దేశంలో పుట్టిన పిల్లలపై రాసిన నవల. మొత్తం 14 నవలలు రాసిన రష్డీ పలు అంతర్జాతీయ పురస్కారాలు కూడా అందుకున్నారు. 1988 లో ది సటానిక్‌ వర్సెస్‌ అనే నవల రాశారు. అది రష్డీకి నాలుగో పుస్తకం. అప్పటి నుంచే ఆయన వివాదాస్పద రచయితగా మారారు. ఈ నవలలో రష్డీ ముస్లిం మతానికి వ్యతిరేకంగా రాశారని, దైవ దూషణకు పాల్పడ్డారని ఇస్లామిక్ ఛాందసవాదులు భగ్గుమన్నారు. పలు ఇస్లామిక్‌ దేశాలు ఆ నవలను నిషేధించాయి.

సల్మాన్‌ రష్డీని ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం

ఆయతుల్లా ఖొమైనీ ఫత్వా

ఇరాన్‌ అత్యున్నత సుప్రీం నాయకుడు ఆయతుల్లా ఖొమైనీ 1989లో రష్డీకి వ్యతిరేకంగా ఏకంగా ఫత్వా జారీ చేశారు. రష్డీని చంపితే 3 మిలియన్‌ డాలర్ల (రూ.23.89 కోట్లు) బహుమానం ఇస్తానని ప్రకటించారు. ఇరాన్‌ ప్రభుత్వం కూడా రష్డీ హంతకులకు 6 లక్షల డాలర్ల (రూ.4.77 కోట్లు) పారితోషికాన్ని ప్రకటించింది. రష్డీని చంపేందుకు ఇరాన్‌ ప్రభుత్వ మద్దతుతో చాలా సంస్థలు నిధులు కూడా సేకరించాయి. దీంతో 9 ఏళ్ల పాటు పోలీసు రక్షణలో అండర్‌ గ్రౌండ్‌లోకి వెళ్లిన రష్డీ.. తన కుటుంబ సభ్యులకు కూడా సమాచారాన్ని తెలపలేదు. 2000 నుంచి అమెరికాలో నివసిస్తున్న ఆయన 2016లో అక్కడి పౌరసత్వం పొందారు. ప్రముఖ సినీతార పద్మాలక్ష్మి సహా నలుగురిని పెళ్లాడిన సల్మాన్‌ రష్డీ నలుగురికీ విడాకులిచ్చారు. ప్రస్తుతం పియా గ్లెన్‌ అనే ప్రియురాలితో సహజీవనం చేస్తున్నారు. ఆయనకు ఇద్దరు పిల్లలు.

సల్మాన్‌ రష్డీపై దాడి సందర్భంగా ప్రథమ చికిత్స

పలు అవార్డులు.. రివార్డులు

సల్మాన్‌ రష్డీకి పలు అంతర్జాతీయ అవార్డులు, రివార్డులు వచ్చాయి. ఆయన్ని 1983లో యునైటెడ్‌ కింగ్‌డమ్‌ యొక్క సీనియర్‌ సాహిత్య సంస్థ అయిన రాయల్‌ సొసైటీ ఆఫ్‌ లిటరేచర్‌లో సభ్యుడిగా చేర్చుకున్నారు. 1999లో ఫ్రాన్స్‌కు చెందిన కమాండర్‌ డి ఎల్‌ ఆర్డ్రే డెస్‌ ఆర్ట్స్‌ ఎట్‌ డెస్‌ లెట్రెస్‌గా నియమితులయ్యారు. సాహిత్యానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా నైట్‌ అనే బిరుదును క్వీన్‌ ఎలిజబెత్‌ – 2 ఇచ్చారు. 1945 నుంచి 50 మంది గొప్ప బ్రిటిష్‌ రచయితల జాబితాను టైమ్స్‌ 2008లో వెల్లడించింది. అందులో రష్డీకి 13వ స్థానం దక్కింది. అమెరికాలోని ఎమోరీ విశ్వవిద్యాలయంలో ఆయన అధ్యాపకుడిగా పని చేస్తున్నారు. అమెరికన్‌ అకాడమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ లెటర్స్‌కు ఎన్నికయ్యారు.

పద్మాలక్ష్మితో సల్మాన్‌ రష్డీ

ద సటానిక్‌ వర్సెస్‌తో వివాదాస్పదుడిగా..

సల్మాన్‌ రష్డీ ప్రారంభంలో రాసిన కాల్పనిక సాహిత్యమంతా భారత ఉపఖండానికి సంబంధించినదే. ది సటానిక్‌ వర్సెస్‌ (సైతాను వచనాలు) అనే నవలపై ముస్లింలు భగ్గుమన్నారు. అల్లాత్‌, ఉజ్జా, మనాత్‌ అనే ముగ్గురు ఆడ దేవతలను పూజించేందుకు అనుమతించే కొన్ని వచనాలను ఖురాన్‌లో చేర్చడానికి నిరాకరించారని రష్డీ తన నవలలో రాశారు. ముస్లింలు ఒకే దేవుడిని పూజిస్తారు. అల్లాహ్‌ తప్ప మరే దేవుడు లేడని నమ్ముతారు. దీనికి వ్యతిరేకంగా సల్మాన్‌ రష్డీ నవల ఉండటంతో ఆయనను హత్య చేయాలని పలు ఇస్లామిక్‌ సంస్థలు పిలుపునిచ్చాయి.

భయమేస్తోంది: తస్లీమా నస్రీన్‌

రష్డీపై దాడిని ఖండించిన తస్లీమా నస్రీన్‌ కూడా బంగ్లాదేశ్‌లో హిందువుల ఊచకోతపై లజ్జ అనే పేరుతో ఓ పుస్తకం రాశారు. దీనిపైనా బంగ్లాదేశ్‌తో సహా పలు ముస్లిం దేశాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ పుస్తకాన్ని పలు దేశాలు నిషేధించాయి కూడా. తస్లీమా నస్రీన్‌ను బంగ్లాదేశ్‌ బహిష్కరించడంతో ఆమె భారత్‌లో తలదాచుకుంటున్నారు. అమెరికాలో ఉంటున్న రష్డీపై దాడి జరుగుతుందని తాను ఊహించలేదని, ఈ ఘటనతో తనకూ భయమేస్తోందని తస్లీమా అన్నారు.