Home Page SliderTelangana

ఖమ్మం జిల్లాలో అమిత్ షా సభ ఎందుకు నిర్వహిస్తున్నామంటే!?

Share with

మళ్లీ కేసీఆర్ గెలిస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుందని రాష్ట్ర ప్రజలందరికీ అర్థం అయ్యిందన్నారు తెలంగాణ బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ కన్వీనర్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. 2018 ఎన్నికల్లో గెలిచిన తర్వాత కేసీఆర్ అహంకారం పెరిగిందన్నారు. అది చూసే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజా వ్యతిరేకతను రుచి చూపించారన్నారు. ఈ నాలుగు సంవత్సరాల్లో తెలంగాణలో గెలిస్తే బీజేపీ గెలిచింది, లేదంటే డబ్బులు పెట్టీ BRS గెలిచింది తప్ప ఎక్కడా కాంగ్రెస్ గెలవలేదన్నారు. కేసీఆర్‌ను ఎదుర్కొనే సత్తా బీజేపీకి మాత్రమే ఉంది అని ప్రజలు గుర్తించారన్నారు ఈటల. BRS గత 5 నెలలుగా అధికార దుర్వినియోగం చేసి ఎన్నికల ప్రచారం చేసుకుంటుందన్నారు. మోదీ, నడ్డా, అమిత్ షా తెలంగాణ మీద ప్రత్యేక దృష్టి పెట్టారని, ఖమ్మంలో బీజేపీకి తక్కువ ఆదరణ ఉందనే భావన ఉన్న నేపథ్యంలో ఇక్కడ మీటింగ్ పెట్టామన్నారు. తెలంగాణ అంతటా బీజేపీ హవా ఉందన్నారు ఈటల రాజేందర్. 27 వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు బహిరంగ సభ నిర్వహిస్తున్నామన్నారు. ఖమ్మం ప్రజలు సభను విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఖమ్మం వ్యవసాయ జిల్లా, అని మిర్చి పంటకు మద్దతు ధర ఇవ్వమని అడిగితే రైతులకు బేడీలు వేసిన చరిత్ర కేసీఆర్‌దన్నారు. అత్యధిక గిరిజన నియోజకవర్గాలు ఉన్న జిల్లా అని, పోడు భూముల సమస్యపై కేసీఆర్ మాయమాటలు చెప్తున్నారన్నారు. అడవిని నమ్ముకొని వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులను, తల్లిని పిల్లని దూరం చేసినట్టు.. భూమి నుండి గిరిజనులు దూరం చేస్తున్నారన్నారు. మా భూమి లక్కోవద్దని పోలీసుల కాళ్ళ మీద పడి వేడుకున్నా బూటు కాళ్లతో తన్నిన చరిత్ర ఇక్కడ ఉందన్నారు. ఖమ్మం జిల్లా చైతన్యానికి మారుపేరన్న ఈటల, తెలంగాణలో ఫైరింగ్ జరిగితే మొదట ఇక్కడే జరిగిందన్నారు. మార్పుకు నాంది పలికే జిల్లా. ప్రజాస్వామ్యాన్ని కోరుకొనే జిల్లా. ధర్మం న్యాయం అండగా ఉండే జిల్లా ఖమ్మం అని ఈటల చెప్పారు. భారత దేశాన్ని వ్యవసాయ దేశంగా గుర్తించిన ప్రధాని నరేంద్ర మోడీ అని, గుంట భూమి ఉన్న 6 వేల రూపాయలు ఇచ్చి రైతులను ఆదుకుంటున్నారన్నారు. ఎరువుల ధర రైతుల నడ్డి విరగ్గొట్టవద్దు అని సబ్సిడీ భారం దేశం భరిస్తోందన్నారు. వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ కాబట్టి రైతులను కాపాడుకుంటున్నారన్నారు. హర్యానా, పంజాబ్ వెళ్ళి కేసీఆర్… అబ్ కి సర్కార్ కిసాన్ సర్కార్ అని మోసపు మాటలు చెప్తున్నారన్నారు. ఇక్కడెమో సంకెళ్లు వేస్తారు, బూటు కాళ్లతో తన్నిస్తారన్నారు. కేసీఆర్ కౌలు రైతుల వెతలు పట్టించుకోరన్నారు ఈటల. రైతులు ఈ విషవలయం నుండి బయట పడేలా అమిత్ షా సభ ఉంటుందని చెప్పారు. మేము ఎక్కువ చెప్పం, చెప్పింది ఖచ్చితంగా చేస్తామన్నారు.

రైతులకు ఒక దిక్సూచిలా ఖమ్మం సభ ఉంటుందన్న ఈటల, కేసీఆర్ ఒక్క రైతు బంధు ఇచ్చి అన్నీ ఎగ్గొట్టారన్నారు. దేశవ్యాప్తంగా ఫసల్ భీమా అమలు అవుతుంటే తెలంగాణలో మాత్రం అమలు కావడం లేదన్నారు. వరి కుప్పల దగ్గర 25 రోజులు రైతులు కాపలా కాసిన చరిత్ర ఖమ్మంలో ఉందన్నారు. ఒక్కో క్వింట ధాన్యానికి 8 కేజీలు కట్ చేశారు. మిల్లులో వడ్లు దించుకోవాలి అంటే 5 వేల నగదు తీసుకున్నారు. ఇది తెలంగాణ రైతుల దుఃఖమన్నారు. తెలంగాణలో బీజేపీ వస్తే ఏ స్కీమ్ కూడా పోదని… ఉన్న స్కీమ్‌లు ఇంకా మెరుగు పరుస్తామన్నారు. బీజేపీ ఈ దేశాన్ని గొప్పగా పాలిస్తున్న పార్టీ అని, దేశ గౌరవాన్ని పెంచిన పార్టీ అన్నారు. నేను భారతీయుని అని గర్వంగా చెప్పుకునేలా చేసిన పార్టీ. ఒక్క స్కాం లేకుండా నీతి నిజాయితీతో పాలిస్తున్న పార్టీ అన్నారు ఈటల. రైతులకు 6 వేలు ఇచ్చిన ఏకైక కేంద్ర ప్రభుత్వం మోదీ సర్కారన్నారు. కుల వృత్తులు మీద ఆధారపడ్డ వారికి కూడా స్కీమ్‌లు ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ. ఆకలి తెలిసిన వ్యక్తి అన్నారు. కన్నీళ్లకు పరిష్కారం చూపించే సత్తా ఉన్న నాయకుడు మోడీ అన్నారు.

కేసీఆర్‌కు నమ్మకం డబ్బు, మద్యం మీద తప్ప ప్రజల మీద లేదన్నారు ఈటల. కేసీఆర్‌కి వచ్చే ఎన్నికల్లో ఇవే ఆయుధాలుగా రాబోతున్నారని… కానీ కొనుగోళ్లకు తెలంగాణ లొంగదన్నారు. ఆత్మగౌరవం వదులుకోదన్నారు. ఈ జిల్లా మంత్రి పుట్టింది కమ్యునిస్ట్ కుటుంబంలో కానీ పచ్చి ఫ్యూడల్ నియంతలా వయవహరిస్తున్నారన్నారు. ఆయన పెట్టిన బాధలు భరించలేక ఒక బీజేపీ కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నారన్నారు. పోలీసులు నమ్ముకొని ప్రజలను హింసిస్తే చరిత్ర క్షమించదన్నారు. ఖమ్మంలో బీజేపీ చాప కింద నీరులా విస్తరిస్తుందన్నారు. భయంతోనే టికెట్లు BRS పాతవారికే ఇచ్చిందన్నారు. సమాజం కులాల సమాహారం కానీ కేసీఆర్ బలహీన వర్గాలకు సీట్లు కేటాయించడంలో అన్యాయం చేశారన్నారు. కేంద్రంలో 27 ఓబీసీలకు, 12 మంది దళితులు, 8 మంది గిరిజన, 5 మంది మైనార్టీలకు కేంద్రం అవకాశం ఇచ్చిందన్నారు. 52 % ఉన్న బీసీలు సీఎం పదవి అనే ఆర్బిట్ లోకి ఎప్పుడు ఎంటర్ కాలేదన్నారు. ఇప్పుడు అయ్యారన్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఎస్సీల్లో 11 శాతానికి ఒక్క మంత్రి పదవి కూడా కేసీఆర్ ఇవ్వలేదన్నారు. 0.6 కేసీఆర్ సామాజిక వర్గం 4 మంత్రి పదవులే కాదు… 10 కీలక శాఖలు వారిదగ్గరే ఉన్నాయన్నారు. బీజేపీలో బీసీలకు సముచిత స్థానం ఉంటుందన్నారు. కేంద్రంలో మొదటిసారి ఒక ఓబీసీ ప్రధాని అయ్యారన్నారు.