Andhra PradeshHome Page Slider

చిలకలూరిపేట వైసీపీ నేత గౌతమ్ రెడ్డిపై చీటింగ్ కేసు ఎవరి పని?

Share with

పల్నాడు జిల్లా చిలకలూరిపేట వైసీపీ నేత ముద్దూరి గౌతమ్ రెడ్డిపై చిలకలూరిపేట పోలీస్ స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైంది. చిలకలూరిపేట టౌన్ పోలీస్ స్టేష‌న్‌లో ఎఫ్.ఐ.ఆర్ 70/2023 నమోదు చేశారు. ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి… కొర్రపాటి వంశీ కృష్ణ వద్ద నుంచి 2 లక్షల రూపాయలు తీసుకున్నట్టుగా పోలీసులు ఎఫ్.ఐ.ఆర్ రిజస్టర్ చేశారు. ఐతే గౌతమ్ రెడ్డిపై మంత్రి విడదల రజినీ కావాలనే కేసు పెట్టించినట్టు నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. ఇటీవల కాలంలో మంత్రికి సంబంధించి స్థానిక మీడియాలో చేసిన కామెంట్స్ వల్లే ఇదంతా జరిగిందని కార్యకర్తలు అంటున్నారు. మొదట్నుంచి పార్టీ కోసం పనిచేస్తే అక్రమ కేసులతో వేధిస్తారా అంటూ గౌతమ్ రెడ్డి అనుచరులు వాపోతున్నారు. వాస్తవానికి విడదల రజినీని మొదట జగన్ కోటరీకి పరిచయం చేయడంలో గౌతమ్ రెడ్డి కీలకంగా వ్యవహరించారని నియోజకవర్గం మొత్తానికి తెలుసంటారు.ఐతే గత నాలుగేళ్లుగా రజినీ తీరుతో విసిగిపోయిన ఆయన.. ఇటీవల ఆమెతో విభేదించినట్టు తెలుస్తోంది. స్థానికంగా ఉండే ఓ యూట్యూబ్ చానెల్ ఇంటర్వ్యూలో మంత్రి రజినీపై పరోక్ష వ్యాఖ్యలు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. స్థానికత నాయకత్వం సరిగా లేదంటూ ఆయన కామెంట్స్ చేశారు. మంత్రిపై పరోక్ష వ్యాఖ్యలతోనే… గౌతమ్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారని చిలకలూరిపేట వైసీపీ కార్యకర్తలు వాపోతున్నారు. అర్బన్ పోలీస్ స్టేషన్‌లో మీడియా వారు సంప్రదిస్తే ముద్దాయితో మాట్లాడటానికి అనుమతి కూడా లేదని చెప్పడంతో వారు ఆందోళనలో ఉన్నారు. అయితే మంత్రికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన ఛానల్ నుంచి వీడియోలు తొలగిస్తే కేసును విత్ డ్రా చేసుకుంటామని గౌతమ్ రెడ్డి అనుచరులకు సమాచారం వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం వ్యవహారంపై మంత్రి రజిని అనుచరులు మండిపడుతున్నారు. ప్రతి చిన్న విషయానికి మంత్రిని లాగుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు గౌతమ్ రెడ్డి కేసు విషయంలో మంత్రికేం సంబంధమని ప్రశ్నిస్తున్నారు.