Home Page SliderTelangana

ఆసిఫాబాద్‌లో బాక్సులు బద్ధలయ్యేదెవరికి?

Share with

ఆసిఫాభాద్ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆత్రం సక్కును కాదని, బీఆర్ఎస్ అభ్యర్థి కోవ లక్ష్మికి హైకమాండ్ టికెట్ ఇచ్చింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఆత్రం సక్కు ఆ తర్వాత పరిణామాలతో గులాబీ కండువ కప్పుకున్నారు. కానీ ఆ తర్వాత పరిణామాలతో పార్టీ ఆయనను కాదనుకుంది. దీంతో తాజా ఎన్నికల్లో కోవ లక్ష్మి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తుంటే… కాంగ్రెస్ నుంచి శ్యాంనాయక్, బీజేపీ నుంచి ఆత్మారామ్ బరిలో నిలిచారు. ఇక్కడ్నుంచి ఈసారి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోడానికి హైకమాండ్ సైతం గట్టి ప్రయత్నం చేస్తోంది. ఐతే ఇక్కడ తాజా మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే అవకాశమున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.

ఆసిఫాబాద్ ఎస్టీ అసెంబ్లీ సెగ్మెంట్‌లో మొత్తం 304 పోలింగ్ బూత్‌లు ఉండగా ఇక్కడ పురుష ఓటర్లు 1,11,878 స్త్రీలు 1,12,766 ట్రాన్స్‌జెండర్లు 17 మొత్తం ఓటర్లు 2,24,661 ఉన్నారు. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో గోండ్లది పైచేయిగా చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ ఆ సామాజికవర్గం 23 శాతానికి పైగా ఉంది. ఇక ఇతర ఎస్సీ, ఎస్టీలు జనాభా 13 శాతం వరకు ఉంది. ఇతర బీసీలు సైతం ఈ నియోజకవర్గంలో 8 శాతం వరకు ఉన్నారు. లంబాడా సైతం 8 శాతం ఉండగా, ఓసీలు 5 శాతం, మున్నూరుకాపులు 4 శాతం, మాదిగలు, ముస్లింలు, మాలలు 3 శాతం చొప్పున ఉన్నారు. ఇతరులు 17 శాతం వరకు ఉన్నారు.