Home Page SliderTelangana

లోక్‌సభ ఎన్నికల్లో ఎవరి బలమెంత!?

Share with

లోక్ సభ ఎన్నికల నగారా మోగకముందే తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. గతంలో లోక్ సభ ఎన్నికలపై ఎన్నడూ లేనంత చర్చ ఇప్పుడు జరుగుతోంది. లోక్ సభకు ఎలా కొట్లాడాలి.. ఎలా ముందడుగేయాలన్నదానిపై పెద్దగా ఆలోచించని రాజకీయ పార్టీలు ఈసారి తెలంగాణలో లోక్ సభ ఎన్నికల్లో పోటీ ఎలా చేయాలి? ఏ ఏ స్థానాల్లో గెలవగలం.. ఎక్కడ్నుంచి పోటీ చేస్తే గట్టి పోటీ ఇవ్వొచ్చన్నదానిపై ఆయా స్థానాల వారీగా లెక్కలు వేసుకుంటూ.. అవకాశాలను శోధించుకుంటున్నాయి. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా 12 స్థానాల్లో గెలుచుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు హితబోధ చేస్తే… అత్యధిక స్థానాలే లక్ష్యమంటూ బీజేపీ అగ్రనేతలు, పార్టీ ముఖ్యనేతల సమావేశంలో ఉద్భోద చేస్తున్నారు.

లోకసభ ఎన్నికల్లో కీలక స్థానాల్లో విజయం సాధించడం ద్వారా తెలంగాణ అభివృద్ధిలో, బీజేపీ భాగస్వామి అవుతుందన్న భావనను కలిగించాలని పార్టీ నేతలు, స్థానిక నేతలకు హితోపదేశం చేశారు. కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ స్థానాల్లో విజయం సాధించాలన్న అభిప్రాయాన్ని కాషాయం నేతలు బలంగా విన్పిస్తున్నారు. అయితే వాస్తవానికి బిజెపికి ఉన్న బలం ఎంత? కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలం ఎంత అన్నది పరిశీలించాల్సి ఉంది. గత రెండు లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనూహ్యమైన ఓట్ షేర్ సాధించింది. 2014లో రాష్ట్ర విభజన తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సుమారుగా 25 శాతం ఓట్లు సాధిస్తే, బీజేపీ పదిన్నర శాతం ఓట్లను సాధించింది. 2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సుమారుగా 30 శాతం ఓట్లు వచ్చినా మూడు స్థానాల్లోనే ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ఐతే బీజేపీ సుమారుగా 20 శాతం ఓట్లతో 4 స్థానాల్లో విజయం సాధించింది.

ఐతే తాజాగా జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 39.4 శాతం ఓట్లు రాబడితే, బీజేపీ 14 శాతం ఓట్లను పొందింది. ఇక బీఆర్ఎస్ పార్టీ 37 శాతం ఓట్లను సాధించింది. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ 17 లోక్ సభ స్థానాల్లో 12 స్థానాల్లో గురిపెడితే, బీజేపీ గతంలో సాధించిన సీట్లకు అదనంగా మరికొన్ని సీట్లలో విజయం సాధించాలని లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ఇక బీఆర్ఎస్ పార్టీ గత లోక్ సభ ఎన్నికల్లో 9 స్థానాల్లో గెలిచింది. 2019లో 88 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించిన ఊపులో ఉన్న ఆ పార్టీ అంచనాలు తప్పవడంతో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల్లో లబ్ధిపొందాయి. తాజాగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారానికి దూరం కావడంతో ఏం జరుగుతుందో చూడాలి. వచ్చే లోకసభ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంటే… కాంగ్రెస్, బిజెపి… బీఆర్ఎస్… అసలు ఎన్నికల్లో గెలవకుండా తామే మొత్తం సీట్లలో గెలుపు సాధించాలని భావిస్తున్నాయి.

మరీ ముఖ్యంగా చెప్పాలంటే సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయంతో ఈసారి లోక్ సభ ఎన్నికల్లోను 12 స్థానాల్లో గెలవాలని పార్టీకి టార్గెట్ నిర్దేశించారు. జాతీయ నాయకత్వం తనపై ఉంచుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని ఆయన భావిస్తున్నారు. ముఖ్యంగా నల్గొండ, ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాల్లోని 7 స్థానాలు అంటే మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ, భువనగిరి, వరంగల్ (ఎస్సీ), మహబూబాబాద్ (ఎస్టీ), ఖమ్మం నియోజకవర్గాలు సునాయాశంగా గెలుస్తామని… గెలిచేందుకు అవకాశమున్న పెద్దపల్లి, జహీరాబాద్, మల్కాజ్‌గిరి, చేవెళ్లపై ఫోకస్ పెంచాలని పార్టీ నేతలకు చెప్పారు. ఇక బీజేపీ సైతం సిట్టింగ్ స్థానాలతోపాటుగా జహీరాబాద్, మెదక్, మల్కాజ్‌గిరి, చేవెళ్ల నాలుగు స్థానాలపై ఎక్కువగా దృష్టి పెడుతోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న సీట్లతో పాటు సిటింగ్ 4 ఎంపీలు గెలిచి తీరాలన్న లక్ష్యంగా పనిచేయాలని నేతలకు పార్టీ సూచిస్తోంది.

అయితే గ్రేటర్ హైదరాబాద్‌లో ఎక్కువ ఎమ్మెల్యేలు గెలుచుకున్న దీమాలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ… ఎంపీలను గెలుచుకోవడం ఆషామాషీ కాదన్నది స్పష్టమవుతోంది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు నేతల నుంచి అంతగా సుముఖత కన్పించడం లేదు. నాడు అధికారంలో ఉన్న సమయంలో పరిస్థితి వేరు. నేడు సిచ్యువేషన్ వేరన్నది ఆ పార్టీ నేతుల గ్రహిస్తున్నారు. గ్రేటర్ పరిధిలో ఉన్న స్థానికులతోపాటు, ఇక్కడ దశాబ్దాలుగా స్థిరపడిన సీమాంధ్ర ఓటరు ఈసారి ఎవరికి జై కొడతారన్నది తేలాల్సి ఉంది. గత ఎన్నికల్లో మెజార్టీ ఓటర్లు కారు పార్టీకి ఓటేశారు. కానీ ఇప్పుడా పరిస్థితుల్లో మార్పు వస్తోందన్న విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయ్. లోక్‌‌సభ ఎన్నికల్లో ప్రధాన నరేంద్ర మోదీని చూసి ఓటేస్తారా? లేదంటే తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారా? అన్నది తేలాల్సి ఉంది. బీజేపీ జాతీయనేతలు మాత్రం తెలంగాణలో బీజేపీకి స్కోప్ ఉందని… గట్టిగా విశ్వసిస్తున్నాయి. గతానికి మించి సీట్లను రాబట్టాలని భావిస్తున్నాయి. రెండు పార్టీల నుంచి పోటీకి ఒక్కో స్థానం నుంచి డజను మందికిపైగా ఆశావహులు పోటీపడుతున్నారు. గెలుపే లక్ష్యంగా టికెట్లు ఇస్తామని రేవంత్ రెడ్డి చెబుతుంటే, బీజేపీ నేతలు సైతం గెలుపు ప్రాతిపదికగా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తామంటున్నారు.

మరోవైపు బీజేపీ సైతం సిట్టింగ్‌లతో పాటు ఎవరికి సీట్లు కేటాయిస్తుందన్నదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ముఖ్యంగా మల్కాజ్‌గిరి సీటుకు ఎక్కువ మంది నేతలు పోటీపడుతున్నారు. బీజేపీ తప్పనిసరిగా గెలుస్తుందన్న అంచనాలున్న జహీరాబాద్ లోనూ పోటీకి నేతలు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి పోటీ చేయడం ఖాయం. మొత్తంగా తెలంగాణలో అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ రెండు పార్టీలు దూకుడు పెంచడంతో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అడుగులేస్తోందన్నది ఆసక్తికరంగా మారుతోంది. పార్టీకి ధైర్యం, అభయం కలిగించేందుకు కేసీఆర్ మెదక్ నుంచి పోటీ చేస్తారా లేదంటే కేసీఆర్ కుటుంబ సభ్యులు మల్కాజ్‌గిరి నుంచి బరిలో దిగుతారా అన్నది చూడాలి. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేశామని కాంగ్రెస్ పార్టీ కాలయాపన చేస్తుందని… ఓటర్లను ప్రభావితం చేస్తే గ్రేటర్ మినహా మిగతా చోట్లైనా విజయం సాధించే అవకాశముందని ఆ పార్టీ వ్యూహకర్తలు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ అస్థిత్వమే ఇప్పుడు గులాబీ పార్టీకి శ్రీరామరక్ష అంటుంటే.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలో లోక్ సభ ఎన్నికల్లో మాకు తిరుగులేదంటున్నాయి.