NewsNews AlertTelangana

మునుగోడులో మునిగేది ఎవరు..? తేలేది ఎవరు..?

Share with

ఉప ఎన్నికలు ఖాయమైన మునుగోడులో తేలేది ఎవరు..? మునిగేది ఎవరు..? సిట్టింగ్‌ స్థానాన్ని కాంగ్రెస్‌ నిలబెట్టుకుంటుందా? బీజేపీ తీర్థం పుచ్చుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఉనికి చాటుతారా? అవకాశాన్ని టీఆర్‌ఎస్‌ అందిపుచ్చుకుంటుందా? మూడుముక్కలాటలో మునుగోడు రణరంగాన్ని తలపిస్తోంది.

రాజగోపాల్‌ రెడ్డి విస్తృత పర్యటనలు

బీజేపీ తరఫున అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి నియోజక వర్గంలో విస్తృత పర్యటనలు చేస్తున్నారు. రాజీనామా చేయాల్సిన పరిస్థితి, మళ్లీ గెలిపిస్తే చేయబోయే పనుల గురించి ప్రజలకు వివరిస్తున్నారు. నియోజక వర్గంలో ఇప్పటికే ఉన్న వ్యక్తిగత పరిచయాలు, తనకు అనుకూలమైన కాంగ్రెస్‌ శ్రేణులు, బీజేపీ కార్యకర్తలతో కలిసి బలమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకున్నారు. పార్టీ మారినా నియోజక వర్గ ప్రజలకు తాను ఎప్పుడూ అందుబాటులోనే ఉంటానని, కేంద్రం నుంచి నిధులు రాబడతానని, రాష్ట్రంలోనూ త్వరలో అధికారం బీజేపీ చేతిలోకి వస్తుందని, ఆ మార్పు మునుగోడు నుంచే ప్రారంభం కావాలని అనుచరులకు నూరిపోస్తున్నారు. మొత్తానికి తన అభిమానుల బలంతోనే ఉప ఎన్నికలో విజయం సాధిస్తాననే ధీమాతో రాజగోపాల్‌ ఉన్నారు.

అన్నీ తానై వ్యవహరిస్తున్న జగదీశ్‌ రెడ్డి

టీఆర్‌ఎస్‌ తరఫున మునుగోడులో నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్‌ రెడ్డి అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. గ్రామానికి రూ.20 లక్షల చొప్పున నిధులు మంజూరు చేయించి గ్రామ పంచాయతీలతో టీఆర్ఎస్‌ అభ్యర్థికి అనుకూలంగా తీర్మానాలు చేయిస్తున్నారు. మరోవైపు ఓటర్లకు పంచేందుకు కేసీఆర్‌ బొమ్మలున్న గోడ గడియారాలు, పార్టీ గుర్తుతో కూడిన గొడుగులు తదితర వస్తువులను సిద్ధంగా ఉంచారు. ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సీఎం కేసీఆర్‌ సైతం పార్టీ నాయకులందరినీ పురమాయించి పార్టీ పట్ల ప్రజల్లో నమ్మకం సడలకుండా చూస్తున్నారు. కాంగ్రెస్‌ సిట్టింగ్‌ స్థానాన్ని.. బీజేపీ ఆశ పెట్టుకున్న ఈ సీటును ఎగరేసుకుపోవాలనే పట్టుదలతో ఉన్నారు.

అభ్యర్థి ఎంపిక వద్దే ఆగిన కాంగ్రెస్‌

మునుగోడులో అభ్యర్థి ఎంపిక వద్దే కాంగ్రెస్‌ ఆగిపోయింది. ఇటీవల గ్రామాల్లో కాంగ్రెస్‌ జెండావిష్కరణ కార్యక్రమాలు, కార్యకర్తలతో భేటీలతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి హల్‌చల్‌ చేశారు. అయితే.. ఢిల్లీలో మునుగోడు పంచాయితీ, రేవంత్‌కు సీనియర్ల చెక్‌ నేపథ్యంలో ఆయన కూడా దూకుడును తగ్గించారు. ఇప్పడు అభ్యర్థి ఎంపికలోనూ పార్టీ సీనియర్‌ నేతల్లో విభేదాలు తలెత్తాయి. పాల్వాయి స్రవంతి, పల్లె రవికుమార్‌, చల్లమల్ల కృష్ణారెడ్డి, పున్నా కైలాశ్‌నేత.. పార్టీ టికెట్‌ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అభ్యర్థి ఖరారైతేనే పార్టీ ప్రచారం ముందుకెళ్లే పరిస్థితి కనిపిస్తోంది. అయితే, ఒకరికి టికెట్‌ కేటాయిస్తే.. ఇతరులు పార్టీకి ద్రోహం చేస్తారేమోననే భయం కూడా కాంగ్రెస్‌ పెద్దల్లో కనిపిస్తోంది. మొత్తానికి సిట్టింగ్‌ స్థానాన్ని నిలబెట్టుకోవడం కాంగ్రెస్‌కు కష్టమనే అభిప్రాయం నెలకొంది. మునుగోడులో టీఆర్‌ఎస్‌ వర్సెస్‌ బీజేపీ పరిస్థితి ఏర్పడటంతో మండల, మునిసిపల్‌ స్థాయి కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు వలసల బాట పడుతున్నారు. ఆయా పార్టీలు కూడా కాంగ్రెస్‌ నేతలకు గాలం వేస్తున్నాయి. మొత్తానికి మునుగోడులో శిబిరాల రాజకీయం ప్రారంభమైంది.