Andhra PradeshHome Page Slider

వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలలో ఎవరికి మోదం..ఎవరికి ఖేధం

Share with

  • ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేలలో మొదలైన గుబులు
  • వచ్చే ఎన్నికల్లో సిట్టింగులలో కొందరికి దక్కని సీట్లు
  • సర్వేలో నివేదికల ఆధారంగా ఎమ్మెల్యే అభ్యర్థులు జాతకాల వెల్లడి
  • సీఎం ప్రకటనతో వైయస్సార్సీపి వర్గాల్లో చర్చనీయాంశం
  • ఎన్నికలవేళ కొత్త కార్యక్రమానికి శ్రీకారం
  • అయోమయంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు

ఏపీలో రానున్న ఎన్నికల్లో అధికార వైయస్సార్సీపీ పార్టీలో దాదాపుగా 30 నుండి 35 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు దక్కకపోవచ్చునే ప్రచారం ఆ పార్టీ వర్గాల్లో విస్తృతంగా జరుగుతుంది. ఇటీవల గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై చివరి సమీక్షా సమావేశం నిర్వహించిన జగన్ ఈ మేరకు ఆయనకు అందిన నివేదికలకు ప్రకారం కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడి క్లారిటీ ఇచ్చారు. ప్రజలలో బలం లేని ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వడం లేదని కానీ టికెట్లు రానివారు బాధ పడవద్దు అని జగన్ చెప్పటంతో ఆ విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. గతంలో జరిగిన సమావేశాలలో కూడా సీఎం జగన్ ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు ఈ విషయం చాలా స్పష్టంగా చెప్పారు. పని తీరు మార్చుకోకపోతే కష్టమే అంటూ వార్నింగ్ లు కూడా ఇచ్చారు.

ప్రభుత్వంపై వ్యతిరేకత లేకపోయినా కొందరు ఎమ్మెల్యేలు తమ పని తీరుతో జగన్ కు భారంగా మారుతున్నారని ఆ సర్వేల్లో తేలిందని అంటున్నారు. మొత్తంగా ముఖ్యమంత్రి జగన్ ప్రకటనతో ఏపీవ్యాప్తంగా రాబోయే ఎన్నికల్లో ఎవరెవరుకి టికెట్లు ఇచ్చేది ఇవ్వకూడదని అంశంపై ఆ పార్టీ అధినేత ఇప్పటికే ఓ క్లారిటీకి వచ్చారని చర్చ మాత్రం జరుగుతుంది. వాస్తవంగా గతంలో పలుసార్లు ఎమ్మెల్యేలతో సమావేశం చేపట్టిన జగన్ అప్పట్లో పనితీరు పరంగా వెనుకబడిన వారికి నివేదికలు అందజేశారు. కానీ ఇటీవల జరిగిన సమావేశంలో మాత్రం ఆయన అలా చేయలేదు పలువురుకి టికెట్లు ఇవ్వటం లేదనే విషయంలో మాత్రం ఆయన క్లారిటీ ఇచ్చారు. దీంతో వచ్చే ఎన్నికల్లో టికెట్లు దక్క కుండా పోయే వాళ్ళు ఎవరనే అంశంపై ఆ పార్టీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కానీ సీటు దక్కని వారికి సముచిత స్థానం కల్పిస్తామన్న జగన్ వ్యాఖ్యలను కూడా కొందరు ఎమ్మెల్యేలు పరిగణలోకి తీసుకుంటున్నట్లు సమాచారం.

ఒకవేళ ఈసారి ఎన్నికల్లో సీటు దక్కకపోతే నామినేటెడ్ పోస్టులైన దక్కుతాయన్న ఆశలో కొందరు ఉన్నట్లు సమాచారం. ఏది ఏమైనప్పటికీ ఇటీవల ముఖ్యమంత్రి నిర్వహించిన పార్టీ ఎమ్మెల్యేల సమీక్షలో సీఎం ప్రకటించిన మేరకు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలలో ఎవరికి మోదం ఎవరికి ఖేదం త్వరలో జగన్ ఏం తేలుస్తారనేది ఇప్పుడు ఏపీవ్యాప్తంగా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. పార్టీ అభ్యర్థుల వడపోత కార్యక్రమం తో పాటు రాబోయే రోజుల్లో పరిశీలకులు, ప్రాంతీయ సమన్వయకర్తలు ఇంకా క్రియాశీలకంగా పనిచేసేలా ప్రతి నియోజకవర్గంలో విభేదాలు లేకుండా చూసుకునేలా దిశా నిర్దేశాలు చేస్తున్నారు. ముఖ్యంగా గ్రామ మండల స్థాయి నాయకుల్లో ఎలాంటి విభేదాలు ఉన్నప్పటికీ వాటన్నిటిని పరిష్కరించుకొని సమన్వయపరచుకొని అడుగులు వేయాలంటూ రాబోయే రోజుల్లో పార్టీ కీలక నేతలు చేయాల్సిన కార్యాచరణకు సంబంధించిన పనులను వివరంగా కూడా జగన్ వారికి చెబుతున్నారు. దీంతో ఇదే ఊపులో మరో రెండు నెలలు కూడా ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించేల మరో కార్యక్రమానికి రూపకల్పన చేశారు.

జగనన్న ఆరోగ్య సురక్ష, ఏపీకి జగనన్న ఎందుకు కావాలి అనే రెండు కార్యక్రమాల కింద వార్డ్ మెంబర్ల నుంచి మంత్రుల వరకు ప్రతి ఒక్కరూ ప్రజలకు అందుబాటులో ఉండాలని కూడా ఆయన సూచించారు. జగన్ ఇలా చేయడం వల్ల ఎన్నికల ముందు కూడా ప్రజలతో సంబంధాలు పెంచుకున్నట్లు అవుతుందని భావిస్తున్నారు. దీనివల్ల ఎన్నికల సమయం అప్పుడే కాకుండా ఎప్పుడు వైఎస్ఆర్సిపి జనంతోనే ఉంటుందనే భావన కలుగుతుందని అంటున్నారు. జనంతోనే నాయకుడు ఉంటే ఫలితాలు ఇంకా సానుకూలంగా వస్తాయని నమ్ముతుండటం వల్ల సీఎం జగన్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు రాజకీయ పరిశీలకలు చెబుతున్నారు. ఒకపక్క వైఎస్ఆర్సిపి వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజల్లో దూసుకుపోవటం, మరోపక్క ప్రతిపక్ష పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్ట్ కావటం రాజకీయంగా వైఎస్సార్సీపీకి మేలు జరిగిందనే అభిప్రాయం సర్వత్ర వ్యక్తమౌతుంది. అధినేత అరెస్టుతో ఆ పార్టీ కార్యకర్తలు డీలపడి ఇళ్లకే పరిమితమైన పరిస్థితి కనపడుతుంది. కార్యకర్తలు డీలా పడిపోగా ఎన్నికల మేనేజ్మెంట్ లో కూడా తెలుగుదేశం పార్టీని ఎవరు మార్గ నిర్దేశం చేసే పరిస్థితి కనిపించడం లేదని పరిశీలకులు అంటున్నారు. ఈ పరిస్థితులన్నీ అంచనా వేసుకున్న జగన్ మరోసారి విజయంపై ధీమా ప్రదర్శిస్తున్నట్లు చెబుతున్నారు.అందుకే ఎమ్మెల్యేల సమావేశంలో ఉన్నది ఉన్నట్లు కుండ బద్దలు కొట్టినట్లు కనిపిస్తోంది. మరి జగన్ ప్రయత్నాలు సఫలమై మరల అధికారం చేపడతారా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది.