News Alert

వచ్చే ఐదేళ్లలో 15లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం: కేజ్రీవాల్‌

Share with

ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్ ప్రజలకు ఉద్యోగం రూపంలో తాయిలాలు ఆశ పెడుతున్నారు. ఆమ్‌ ఆద్మీ పార్టీకి నానాటికీ పెరిగిపోతున్న ఆదరణను చూసి బీజేపీ చాలా భయపడుతోందని అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఉనికిని చూసి భయపడిన బీజేపీ, గుజరాత్‌లో రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్‌ పాటిల్‌ను త్వరలో తొలగించబోతోందంటూ ట్వీట్‌ చేశారు. గుజరాత్‌లో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన పలు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. విద్య, ఉపాధి తదితరాలపై భావ్‌నగర్‌లో యువతతో ముచ్చటించారు. మధ్యప్రదేశ్‌ వ్యాపం స్కాంను తలదన్నే రీతిలో గుజరాత్‌లో భారీ స్థాయి పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ కుంభకోణం జరుగుతోందని ఆరోపించారు.

రాష్ట్ర స్థాయి నియామక పరీక్షల్లో కొన్నేళ్లుగా ప్రశ్నపత్రాలు లీక్ అవుతున్నాయని… 2015 నుంచి రాష్ట్రంలో నమోదైన ప్రశ్నపత్రాల లీకేజీ కేసులను ప్రస్తావించారు. బీజేపీ ప్రభుత్వానికి సిగ్గుగా అన్పించడం లేదా? పరీక్షలే సరిగా నిర్వహించడం చేతగానివారు రాష్ట్రంలో, కేంద్రంలో ప్రభుత్వాలను నడుపుతారు అంటూ ఎద్దేవా చేశారు. గుజరాత్‌లో తాము అధికారంలోకి వస్తే పేపర్ లీకేజీతో సంబంధమున్న వారందరినీ జైలుకు పంపుతాం అని హెచ్చరించారు. పేపర్ల లీకేజీకి పాల్పడేవారికి 10ఏళ్ల జైలు శిక్షపడేలా చట్టం తీసుకోచ్చి దోషులకు శిక్షపడేలా చేస్తామని హమీ ఇచ్చారు.


ప్రభుత్వ ఉద్యోగాల్లో అధికార పార్టీ వాళ్లకే ప్రాధాన్యమిస్తామని ఓ మంత్రి చెబుతున్నారని ఆరోపించిన కేజ్రీవాల్.. ప్రభుత్వ ఉద్యోగాలేమన్నా మీ అబ్బ సొత్తా? అవి ఏ పార్టీకో చెందినవి కాదు…గుజరాత్‌ యువతకే సొంతం. ఆప్ అధికారంలోకి వస్తే పారదర్శకంగా ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. వచ్చే ఐదేళ్లలో ప్రభుత్వ రంగంలో 15 లక్షల ఉద్యోగాలివ్వడంతో పాటు ప్రైవేటు రంగంలో స్థానికులకు 80 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించారు. ఇందుకోసం జాబ్ క్యాలెండర్‌ రూపొందించామని చెప్పారు.