Andhra PradeshNews

ఏపీ ఎన్నికలు… వాలంటీర్లు, డ్వాక్రా సంఘాలు కీలకం

Share with

◆ ప్రతిపక్షాలకు ఇబ్బందిగా మారిన వాలంటీర్ వ్యవస్థ
◆ వైయస్సార్ సున్నా వడ్డీ పథకం పై హర్షం వ్యక్తం చేస్తున్న డ్వాక్రా సంఘాలు
◆ రాబోయే ఎన్నికల్లో వీరే కీలకమంటున్న విశ్లేషకులు

ఏపీలో ఎన్నికల వాతావరణం అప్పుడే ప్రారంభమైంది. ప్లీనరీ విజయవంతం తర్వాత వైఎస్ జగన్ దూకుడును పెంచారు. ఇప్పటిదాకా తాడేపల్లిలోని తన స్వగృహనికే పరిమితమైన వైఎస్ జగన్ నెమ్మదిగా తన పర్యటనలను ప్రారంభించారు. వైయస్ జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలు సంతృప్తి స్థాయిలో అన్ని వర్గాల ప్రజలకు కూడా అందాయి. ఈసారి జరగబోవు సార్వత్రిక ఎన్నికల్లో వివిధ పథకాలతో లబ్ధి పొందిన లబ్ధిదారుల చేత ఓట్లు వేయించడం దగ్గర నుండి తటస్థంగా ఉన్న ఓటర్లను వైసీపీకి ఓట్లు వేసే విధంగా మలచటంలో వాలంటీర్ వ్యవస్థ, డ్వాక్రా సంఘాలు కీలకం కానున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌తిష్ఠ‌త‌కు తొలి పునాది వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ‌. సీఎం జ‌గ‌న్ ఆలోచ‌న‌కు దీపిక అది. ఆ వ్య‌వ‌స్థ అందుబాటులోకి వ‌చ్చాక ఏపీ ప్ర‌జ‌లు క‌నీవినీ ఎరుగ‌ని సేవ‌ల‌ను పొందుతున్నారు. ఈ వ్య‌వ‌స్థ ద్వారా ఏపీ ప్ర‌భుత్వం ఖ్యాతి దేశ‌వ్యాప్త‌మైంది. వాలంటీర్ల వ్య‌వ‌స్థ ప‌నితీరును ప్ర‌ముఖులెంద‌రో మెచ్చుకుంటున్నారు. ఇదే ప్ర‌తిప‌క్షాల‌కు కూడా ఇబ్బందిగా మారుతున్న‌ట్లు క‌నిపిస్తోంది.

జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఏర్పాటు చేసిన వాలంటీర్ల వ్యవస్ధపై తెలుగుదేశంపార్టీ నేతలు బురద చల్లుతున్నారు. ఈ వ్యవస్ధ వల్ల జగన్ కు ఎక్కడ మంచిపేరు వస్తుందో అన్న ఆందోళనతో మొదటి నుండి టిడిపి ఈ వ్యవస్ధను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసింది. కానీ అంతర్గతంగా చంద్రబాబు నాయుడు మదిలో వాలంటీర్ వ్యవస్థ కంటిలోని నలుసు మాదిరిగా మారిందని అంటున్నారు. ఈసారి జరిగే ఎన్నికల్లో కార్యకర్తల కన్నా మెరుగైన స్థాయిలో వాలంటీర్ వ్యవస్థ పని చేస్తుందని వారు భావిస్తున్నారు. అందుకే ఎప్పుడు అవకాశం వచ్చినా వాలంటీర్ వ్యవస్థ పై చంద్రబాబు చిందులు వేస్తూ వస్తున్నారు.
ఒకప్పుడు పాలక ప్రతిపక్ష పార్టీలన్నీ ఓటర్ల ప్రభావితం చేసినందుకు ఎక్కువగా కార్యకర్తలపై ఆధార పడేవారు కార్యకర్తల్లోని వీధి, డివిజన్ ,గ్రామ , వార్డు నాయకుల్ని గుర్తించి వారిని తమకు అనుకూలంగా మార్చుకునేవారు వారి ద్వారా క్షేత్రస్థాయిలో తమ పార్టీ ప్రచారాన్ని చేపట్టేవి. ఒక విధంగా మొత్తం ఎన్నికల వ్యవస్థలో కార్యకర్తలే కీలకంగా ఉండేవారు.

కానీ ఈసారి కార్యకర్తలతో పాటు డ్వాక్రా సంఘాలు కూడా కీలకం కానున్నాయి. ఏపీలో డ్వాక్రా సంఘాల సభ్యుల సంఖ్య అత్యధికంగా ఉంది. ప్రభుత్వం తరఫున జరిగే ఏ కార్యక్రమానికైనా వారే ప్రధానంగా తరలివస్తున్నారు. వీరి ద్వారానే వివిధ పథకాలకు క్షేత్రస్థాయిలో ప్రభుత్వం ప్రచారం కల్పిస్తుంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి వీరికి ప్రాధాన్యత అనూహ్యంగా పెరిగింది. వైయస్ జగన్ అధికారంలోకి వచ్చాక ఆయన ఇచ్చిన హామీ మేరకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం ద్వారా పొదుపు సంఘాలకు ప్రతి సంవత్సరం వారి వారి అకౌంట్లో నేరుగా డబ్బులు జమ చేస్తూ వస్తున్నారు. దీంతో పొదుపు సంఘాల్లోని మహిళలు వైయస్ జగన్ పై అభిమానాన్ని నమ్మకాన్ని పెంచుకున్నారు. రాబోవు ఎన్నికల్లో వాలంటీర్ వ్యవస్థ, డ్వాక్రా సంఘాలు, పార్టీ కార్యకర్తలు ఆశించిన స్థాయిలో పనిచేస్తే తప్పకుండా జగన్ అంటున్న 175/175 సీట్ల లక్ష్యం నెరవేరుతుందని రాజకీయ పండితులు భావిస్తున్నారు. మరి 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఘోర ఓటమికి కారణమైన డ్వాక్రా సంఘాలు ఈసారి ఎన్నికల్లో ఎటువైపు మొగ్గు చూపుతాయో వేచి చూడాల్సి ఉంది.