News

పెట్టుబడులే ధ్యేయంగా విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్

Share with

విశాఖ వేదికగా మార్చ్ 3, 4 తేదీల్లో ఇన్వెస్టర్ సమ్మిట్

విశాఖలో ప్రతిష్టాత్మకంగా మార్చ్ 3, 4 తేదీల్లో నిర్వహించనున్న గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ సన్నాహకాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు రాష్ట్రాలలో పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించడానికి పలు రోడ్డు షోలను నిర్వహిస్తుంది. దీనిలో భాగంగా తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లోని ఐటీసీ కాకతీయ హోటల్ వేదికగా ఆంధ్రప్రదేశ్‌‍లో పెట్టుబడులు పెడితే కలిగే ప్రయోజనాలను పారిశ్రామికవేత్తలకు ఆంధ్రప్రదేశ్ తరపున ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం పాల్గొని వివరించారు.

ఐటీ డెస్టినేషన్‌గా విశాఖపట్నం – ఐటీ మంత్రి గుడివాడ అమర్నాధ్

“హైదరాబాద్ లానే విశాఖపట్నం కూడా కాస్మోపాలిటిన్ సంస్కృతితో వేగవంతమైన పట్టణీకరణ, అభివృద్ధిని కలిగి ఉంది. సుందరమైన వాతావరణం,సుదీర్ఘ సముద్ర తీరం వంటి వాటితో విశాఖపట్నం అన్ని రంగాలకు వసతులు కల్పించనుంది. ప్రపంచ ఐటీ డెస్టినేషన్‌గా విశాఖపట్నంపై మార్చడానికి ప్రయత్నిస్తున్నాం. మూడు పారిశ్రామిక కారిడార్లు ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. విశాఖపట్నం-చెన్నై, చెన్నై-బెంగళూరుతో పాటు హైదరాబాద్-బెంగళూరు కారిడార్లను ఏపీ కలిగి ఉంది. పారిశ్రామిక కేటాయింపులకు ఏపీలో 48,000 ఎకరాల భూమి అందుబాటులో ఉంది. దాదాపు 19 రాష్ట్రాలతో పోటీ పడి దక్షిణాదిలోనే బల్క్ డ్రగ్స్ పార్క్ పొందిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో వరుసగా మూడేళ్లుగా ఏపీ నెం.1 స్థానంలో ఉంది. త్వరలో 2023-2028కి కొత్త ఐటీ పాలసీని తీసుకురాబోతున్నాం. స్టార్టప్ కల్చర్‌ను ప్రోత్సహిస్తూ, సమతుల్య ప్రాంతీయ అభివృద్ధి, నైపుణ్యంతో పాటు ఉపాధి కల్పనను ప్రోత్సహించాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఏపీ సామాజిక, ఆర్థిక, పర్యావరణ ప్రమాణాలలో నీతి ఆయోగ్ ద్వారా ఎస్డీజీలో 4వ స్థానంలో ఉంది. ఎగుమతుల్లో 1.44 లక్షల కోట్ల వృద్ధితో 6వ స్థానంలో ఉంది, గత ఏడాదితో పోలిస్తే 15.33% వృద్ధిని సాధించాం. పత్తి, పట్టు ఉత్పత్తిలో భారతదేశంలో ఏపీ 2వ అతిపెద్ద ఉత్పత్తిదారు. మొబైల్ తయారీ రంగంలో ప్రతి నెలా 3.5 మిలియన్ మొబైల్‌లను ఏపీ అందిస్తోంది. ప్రతి సెకనుకో మొబైల్ ఏపీలో తయారవుతోంది. రాష్ట్రంలో నాలుగు ఎలక్ట్రానిక్‌ తయారీ రంగాలు ఉన్నాయి.”

ఏపీ అన్ని రకాల ఎగుమతులు దిగుమతులకు ఆసియా దేశాలకు ముఖ ద్వారం – ఆర్థిక మంత్రి బుగ్గన

“ఆటోమొటివి రంగంలో, అశోక్ లేలాండ్, కియా, హీరో, ఇసుజు, అపోలో, యోకోహామా, భారత్ ఫోర్జ్ వంటివి ఎలక్ట్రానిక్స్ సిస్టమ్స్ డిజైన్, తయారీలో బ్లూ స్టార్, ఫాక్స్‌కాన్, డయాకాన్, పానాసోనిక్, జడ్ టీటీ, ఫ్లెక్స్, వింటెక్ వంటి క్లస్టర్‌లను ఏపీ కలిగి ఉంది. అలాగే మొబైల్ తయారీకి ఏపీ కేంద్రంగా ఉంది. ఫార్మాస్యూటికల్స్ కు హైదరాబాద్‌తో పాటు ఏపీలో మైనోల్న్, బయోకాన్, లుబెన్, హెటెరో, లూరెస్, దివిస్, ఆరిబిందో, జీ.ఎస్.కె, డాక్టర్ రెడ్డిస్, వంటివి ఉన్నాయి. ఏపీలో వ్యాపార వాతావరణం కోసం సరైన పర్యావరణ వ్యవస్థ ఉంది. వరుసగా మూడేళ్లపాటు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ నంబర్ 1 స్థానంలో ఉండేలా చేసింది”.

జంట నగరాలుగా వైజాగ్, విజయనగరం – రవిచంద్రారెడ్డి

హైదరాబాద్‌లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023లో పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ఏపీటీపీసీ చైర్మన్ రవిచంద్రారెడ్డి మాట్లాడారు. రానున్న రోజుల్లో విజయనగరం, వైజాగ్ జంట నగరాలుగా ఆవిర్భవిస్తాయని అన్నారు. కాకినాడ, నెల్లూరు, కడప ఇలా అనేక ఇతర జిల్లాలలో అనేక ప్రోత్సాహకాలు అందించడం ద్వారా అపారమైన అవకాశాలను ఏపీ అందిస్తుందన్నారు. హైదరాబాద్‌ను కోల్పోయిన తరువాత, మా ప్రాణాన్ని కోల్పోలేదని ఏపీకి హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం వైజాగ్ అని అన్ని రకాల మౌలిక సదుపాయాలను కలిగి ఉందన్నారు. అంతేకాకుండా భోగాపురం విమానాశ్రయంతో విజయనగరం, వైజాగ్ జంట నగరాలుగా ఆవిర్భవించనున్నాయన్నారు. జర్మనీకి వెళ్లినప్పుడు అక్కడ హాంబర్గ్ నగరం జర్మనీకి ఆదాయాన్ని ఇవ్వడాన్ని చూసామని అలా వైజాగ్ ను ఎందుకు అభివృద్ధి చేయలేమని ప్రశ్నించారు.

ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఏపీ అగ్రగామి – భరత్ కుమార్ తోట, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్

హైదరాబాద్‌లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌లో భరత్ మాట్లాడుతూ.. కోకో ఉత్పత్తిలో 70% ఆంధ్రప్రదేశ్ నుండి వస్తోందని, ఏపీ కేవలం రైస్ బౌల్ మాత్రమే కాదు, ఇది దేశంలోనే పెద్ద చాక్లెట్ బౌల్ అని, అరటిపండ్లు, ఆహారం, సుగంధ ద్రవ్యాలు, టమాటా ప్రాసెసింగ్‌ కోసం ఏపీలో నాలుగు మెగా యూనిట్లు రానున్నాయని అలాగే ఏపీ అతిపెద్ద పల్ప్ ఎగుమతిదారు, ఎక్కువ పల్ప్ ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, అనంతపురం జిల్లాల నుండి వస్తుందని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో సీఐఐ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ వైస్ చైర్మన్ శేఖర్ రెడ్డి,ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు సీఈవో సృజన, ఏపీ మారిటైమ్ బోర్డు సీఈఓ షణ్మోహన్, ఐటీ & ఎలక్ట్రానిక్స్ అండ్ స్కిల్ డెవలప్‌మెంట్ సెక్రటరీ సౌరభ్ గౌర్, హ్యాండ్లూమ్స్ & టెక్స్‌టైల్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ సునీత, రెన్యూవబుల్ ఎనర్జీ ప్రమోషన్ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ డా. ఎం కమలాకర్ బాబు, విదేశాంగ మంత్రిత్వ శాఖ హైదరాబాద్ శాఖ కార్యాలయం అధిపతి దాసరి బాలయ్య ఇతర ప్రభుత్వ ప్రతినిధులు హాజరయ్యి ఏపీ రాష్ట్రంలో పారిశ్రామిక విధానం,అవకాశాలను పారిశ్రామికవేత్తలకు వివరించారు.