Telangana

సోలార్ ప్యానెల్స్ డబుల్ ధమాకా

Share with

 హైదరాబాద్: మనసర్కార్

సౌర విద్యుత్, మిగతా ప్రత్యామ్నాయాలతో పోలిస్తే చాలా సమర్థవంతమైనది, కాలుష్యరహితమైనదిగా గుర్తింపబడుతోంది. ఇప్పుడు సౌర విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి ఎప్పటికప్పుడు నూతన సాంకేతికత వల్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం బాగా పెరుగుతోంది. కొత్తగా కనిపెట్టిన రెండుముఖాలు గల సౌరఫలకాలు చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. ఈ ఫలకాలలో పైభాగంలో ఎండ నేరుగా పడితే, ఈ ఫలకాల క్రిందిభాగంలో కూడా భవనం శ్లాబుపై పడే వేడిని గ్రహించి విద్యుతుత్పత్తి చేస్తుంది. సాధారణ సౌరఫలకాలతో పోలిస్తే వీటి సామర్ధ్యం 10-12 శాతం ఎక్కువగా ఉంటోంది. సోలార్ ట్రాకర్ ద్వారా 27 శాతం వరకూ విద్యుత్ సరఫరా పెరుగుతుంది. ఈ ఫలకాలకు ఇరువైపులా యూవీ నిరోధకత కల్గి ఉన్నందువల్ల వీటి మన్నిక కూడా చాలా ఎక్కువకాలం ఉంటుంది.

దేశంలోనే మొదటి హరిత భవనం మాదాపూర్‌లోని సీఐఐ గోద్రెజ్ సొరాబ్జీ గ్రీన్ బిజినెస్ సెంటర్ భవనం. ఈ భవనాలపై 130 కిలోవాట్ల సామర్థ్యం కల్గిన బైఫేషియల్ సోలార్ పీవీ మాడ్యూల్స్‌ను ఏర్పాట్లు చేశారు. ఇవి సాధారణ ఫలకాల కంటే 30 శాతం ఎత్తు అనగా 1.5 మీటర్లు పెంచారు. ఇవి సంవత్సరానికి 1.89 లక్షల యూనిట్లు విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ ఎత్తు పెంచడం వల్ల ప్రస్తుతం ఈ ఉత్పత్తి 2.20 లక్షల యూనిట్లకు చేరుకుంది. అంటే అదనంగా 30 వేల యూనిట్లు ఉత్పత్తి అయ్యాయి. ఈ కేంద్రానికి కావల్సిన యూనిట్లు కేవలం 2.03 లక్షల యూనిట్లు మాత్రమే. అంటే 17 వేల యూనిట్లు మిగిలిపోతుందన్నమాట. ఈ మిగులు విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేస్తున్నారు. ఆవిధంగా ఈ భవనం నెట్‌జీరో భవనంగా గుర్తింపు తెచ్చుకుంది. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఈ నెల 20నుంచి 20 వఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్‌ జరగబోతోంది. ఈ ప్రదర్శనలో ఈ ద్విముఖ సౌరఫలకాలను ప్రదర్శించబోతున్నారు.