Andhra PradeshHome Page Slider

తిరుమల ఆనంద నిలయంలోని వీడియో రికార్డింగ్‌పై టీటీడీ విచారణ

Share with

తిరుమల శ్రీవారి ఆలయంలో వీడియో రికార్డింగ్ కలకలం సృష్టించింది. మూడంచెల భద్రతను దాటుకుని ఓ భక్తుడు మొబైల్ ఫోన్‌తో తిరుమల ఆలయంలోకి ప్రవేశించడమే కాకుండా, తన ఫోన్‌తో ఆలయం నలుమూలల నుంచి ఆనంద నిలయాన్ని షూట్ చేసి… ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. వర్షం కురుస్తున్న సమయంలో ఆనంద నిలయానికి అతి సమీపంలో నుంచి భక్తుడు వీడియో తీశాడని తెలుస్తోంది.

అయితే ఆ భక్తుడు ఆలయంలో ఇంకేమైనా చిత్రీకరించాడా అనేదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. మరోవైపు ఈ ఘటనపై టీటీడీ విచారణ చేపట్టింది. ఆలయంలోని సీసీ కెమెరా విజువల్స్‌ను అధికారులు పరిశీలిస్తున్నారు. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఆలయానికి వచ్చే భక్తులను క్షుణ్ణంగా పరిశీలించి లోనికి అనుమతిస్తున్నారు. సెల్‌ఫోన్లు, కెమెరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు.

ఇంత కట్టుదిట్టమైన భద్రత ఉన్నప్పటికీ, భక్తుడు ఆలయంలోకి సెల్ ఫోన్ తీసుకెళ్లడమే కాదు, ఆలయ ప్రాంగణాన్ని చిత్రీకరించాడు. ఆనంద నిలయాన్ని వీడియోలు తీయడంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.