NewsNews AlertTelangana

టీఆర్‌ఎస్‌ వర్సెస్‌ బీజేపీ.. కాంగ్రెస్‌ పరిస్థితి?

Share with

తెలంగాణాలో ఓవైపు బీజేపీ దూసుకెళ్తోంది.. మరోవైపు టీఆర్‌ఎస్‌ ఉద్యమకాలం నాటి పరిస్థితి కోసం తపిస్తోంది.. ఇంకోవైపు కాంగ్రెస్‌ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. మునుగోడులో టీఆర్‌ఎస్‌, బీజేపీ భారీ బహిరంగ సభలు.. బండి సంజయ్‌, రాజాసింగ్‌ల అరెస్టు.. రాజాసింగ్‌పై పీడీ యాక్ట్‌.. కేసీఆర్‌ కుమార్తె కల్వకుంట్ల కవితకు ఢిల్లీ లిక్కర్‌ స్కాంతో లింకుల ఆరోపణలు.. టీఆర్‌ఎస్‌ నేతలపై ఈడీ దాడుల బెదిరింపులు.. వరంగల్‌లో మహా సంగ్రామ ముగింపు సభ.. అమిత్‌ షా, జేపీ నడ్డా తెలంగాణాలో సుడిగాలి పర్యటనలు.. రామోజీ రావు, జూనియర్‌ ఎన్టీయార్‌, మిథాలీ రాజ్‌, నితిన్‌ వంటి ప్రముఖులతో బీజేపీ ఉద్ధండుల భేటీ.. వరుస కార్యక్రమాలతో తెలంగాణాలో రాజకీయం ఒక్కసారిగా అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తోంది. రాష్ట్రంలో వాతావరణం ఇప్పుడు టీఆర్‌ఎస్‌ వర్సెస్‌ బీజేపీగా మారిపోయింది. కాంగ్రెస్‌ పరిస్థితి ప్రశ్నార్ధకంగా మారింది.

రాష్ట్రంలో ఇక మాదే అధికారం: బీజేపీ

తెలంగాణాలో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్న బీజేపీ రాష్ట్రంలో కొత్త అవకాశాల వేటలో పడింది. పార్టీని క్షేత్ర స్థాయిలో బలపరుస్తూనే ప్రముఖులకు టికెట్లు ఇచ్చి వచ్చే ఎన్నికల్లో ఓట్లు, సీట్ల సంఖ్యను పెంచుకోవడంపై బీజేపీ తీవ్ర కసరత్తు చేస్తోంది. మునుగోడు ఉప ఎన్నిక రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్‌గా మారింది. దీంతో ఈ స్థానాన్ని దక్కించుకొని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమదే గెలుపు అనే సంకేతాన్ని ప్రజల్లోకి పంపించాలని బీజేపీ తపిస్తోంది.

ముందస్తుకు వెళ్లాలా.. పూర్తి కాలం ఉండాలా..: కేసీఆర్‌

బీజేపీ దూకుడును ఎలా అడ్డుకోవాలా? అని కేసీఆర్‌ ఆందోళన చెందుతున్నారు. కుమార్తె కల్వకుంట్ల కవితపై లిక్కర్‌ స్కాం ఆరోపణలతో టీఆర్‌ఎస్‌ పార్టీ డిఫెన్స్‌లో పడిపోయింది. తొలుత తక్కువగా అంచనా వేసిన బీజేపీ.. ఇప్పుడు అనకొండలా తయారై తననే మింగేందుకు సిద్ధమవుతుండటంతో కేసీఆర్‌ అండ్‌ టీం దిక్కుతోచని స్థితిలో పడింది. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలా.. వచ్చే ఏడాది డిసెంబరు వరకూ తన పదవిని కొనసాగించాలా.. అనే డైలామాలో సీఎం కేసీఆర్‌ పడ్డారు. లాభనష్టాలను అంచనా వేస్తూ.. ఎనిమిదేళ్ల తన పాలనపై అసంతృప్తితో ఉన్న వారిని ఎలా బుజ్జగించాలా? అనే ఆలోచన చేస్తున్నారు. వివిధ రంగాల, వర్గాల ప్రజలు సుదీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలను ఒక్కొక్కటీ పరిష్కరిస్తూ.. అందరినీ మళ్లీ మచ్చిక చేసుకుంటూ.. ఉద్యమకాలం నాటి అనుచర గణాన్ని సాధించాలన్న కృతనిశ్చయంతో కేసీఆర్‌ ఉన్నారు. ఓ వైపు కుమారుడు కేటీఆర్‌, మరోవైపు అల్లుడు హరీశ్‌రావుల పైనే పూర్తి స్థాయి నమ్మకంతో అడుగు ముందుకేస్తున్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఉనికే ప్రశ్నార్ధకం..

రాష్ట్రంలో కాంగ్రెస్‌ రోజురోజుకూ బలహీనపడుతోంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరడం.. త్వరలో జరిగే ఉప ఎన్నికలో బీజేపీ తరఫున బరిలోకి దిగనుండటం.. కాంగ్రెస్‌లో రేవంత్‌రెడ్డి, సీనియర్‌ నాయకుల మధ్య ఆధిపత్య పోరు.. రాజగోపాల్ రెడ్డి సోదరుడు, కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీపై తిరుగుబాటు.. మునుగోడు ప్రచారానికి దూరం.. మునుగోడు అభ్యర్థి ఎంపికలో అయోమయం.. ఇన్ని సమస్యల మధ్య తెలంగాణాలో కాంగ్రెస్‌ మూడో స్థానానికి దిగజారే పరిస్థితి కనబడుతోంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి దూకుడును సహించలేని రాష్ట్ర కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు ఆయనకు చెక్‌ పెట్టే ఆలోచనతో కాంగ్రెస్‌ పట్ల రాష్ట్ర ప్రజల్లో చులకన భావం వచ్చేట్లు చేస్తున్నారు. దీంతో రాష్ట్రాన్ని సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్‌ ఉనికే ఇప్పుడు ప్రశ్నార్ధకమయ్యే పరిస్థితి తలెత్తింది. జాతీయ స్థాయిలోనూ పార్టీకి అనుకూల పరిస్థితి లేకపోవడంతో రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులు ఒక్కొక్కరే జారిపోతున్నారు.