Home Page SliderInternational

యెమెన్‌లో ఘోరం, తొక్కిసలాటలో 85 మంది మృతి

Share with

యుద్ధంలో దెబ్బతిన్న యెమెన్‌లో గురువారం జరిగిన ఒక చారిటీ పంపిణీ కార్యక్రమంలో 85 మందికి పైగా మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. హుతీ అధికారులు మాట్లాడుతూ, దశాబ్ద కాలంలో జరిగిన ఘోరమైన తొక్కిసలాటలలో ఇది ఒకటని చెప్పారు. అరేబియా ద్వీపకల్పంలోని అత్యంత పేద దేశంలో ఘోరం, ఈద్ అల్-ఫితర్‌కు కొన్ని రోజుల ముందు జరిగింది. ఇస్లామిక్ పవిత్ర మాసమైన రంజాన్ ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ తొక్కిసలాట చేటుచేసుకొంది. రాజధానిలోని బాబ్ అల్-యెమెన్ జిల్లాలో జరిగిన తొక్కిసలాట తర్వాత 85 మంది మరణించగా, 322 మందికి పైగా గాయపడినట్టు హుతీ భద్రతా అధికారి తెలిపారు. చనిపోయిన వారిలో మహిళలు, పిల్లలు ఎక్కువగా ఉన్నారు.

హుతీ నియంత్రణలో ఉన్న సనాలో, పేదలకు పండుగ కానుక పంపిణీ చేస్తున్న పాఠశాలలో ఈ సంఘటన జరిగింది. పేదరికంలో ఉన్న దేశంలో వందలాది మంది ప్రజలు బహుమతి కోసం ఎగబడ్డారు. హుతీ తిరుగుబాటుదారుల ఆధీనంలోని అల్ మసీరా టీవీ ఛానెల్ ప్రసారం చేసిన వీడియోలో, ప్రజలు ఒకరిపై ఒకరు ఎక్కడం కన్పించింది. ఉచిత కానుకలు పంపిణీ చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నట్లు హుతీ అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. కొందరు వ్యాపారులు డబ్బును పంపిణీ చేసే సమయంలో తొక్కిసలాట జరిగినట్టు తెలుస్తోంది. దీనిపై విచారణకు కమిటీని ఏర్పాటు చేసినట్లు హుతీ రాజకీయ చీఫ్ మహదీ అల్-మషత్ తెలిపారు.

పేదరికంలో మగ్గుతున్న మూడింట రెండొంతుల యెమెన్‌ ప్రజలు
యెమెన్‌లో ఎనిమిదేళ్లకు పైగా జరిగిన అంతర్యుద్ధం ప్రపంచంలోని అత్యంత ఘోరమైన మానవతా విషాదాలలో ఒకటిగా ఐక్యరాజ్యసమితి అభివర్ణించింది. 2014లో ఇరాన్-మద్దతుగల హుతీ తిరుగుబాటుదారులు సనాను స్వాధీనం చేసుకోవడంతో వివాదం ప్రారంభమైంది. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడానికి సౌదీ నేతృత్వంలోని సంకీర్ణం తరువాతి సంవత్సరం జోక్యం చేసుకొంది. అక్టోబర్‌లో గడువు ముగిసిన తర్వాత కూడా, గత ఏడాది ఆరు నెలలుగా, UN మధ్యవర్తిత్వం కారణంగా పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం యెమెన్ జనాభాలో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ మంది దారిద్య్ర రేఖకు దిగువన నివసిస్తున్నారు. హుతీ-నియంత్రిత ప్రాంతాల్లోని ప్రభుత్వ ఉద్యోగులకు సంవత్సరాలుగా వేతనాలు చెల్లించడంలేదు. సుమారుగా యెమెన్‌లో రెండు కోట్ల మందికి పైగా ఈ ఏడాది కూడా మానవతా సహాయం అవసరపమని ఐక్యరాజ్యసమితి తెలిపింది.