News AlertTelangana

మతాల పేరుతో కొట్టుకోమని ఏ దేవుడు చెప్పిండు

Share with

`మతాల పేరుతో కొట్టుకోవాలని ఏ దేవుడు చెప్పాడు? ఈ దేశంలో తిండి, నీళ్లు లేక ఎంతో మంది అల్లాడుతున్నారు. అలాంటి వాటి గురించి ఆలోచించడం మానేసి అనవసర విషయాలపై ఎందుకు దృష్టిపెడుతున్నారు అని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. కృష్ణుడు, రాముడు, జీసస్, అల్లాలలో ఎవరైనా ఇతర మతాల వారిని చంపమని చెప్పారా?` అని బీజేపీ నాయకులను సూటిగా నిలదీశారు. బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నకేటీఆర్‌.. తెలంగాణాలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు.


8 ఏళ్లలో ఏం సాధించారని విమర్శిస్తున్నవిపక్ష నేతలు వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు . కేసీఆర్ హయాంలో తెలంగాణ రాష్ట్రం ఎంతో పురోగతి సాధించిందన్నారు. `ఏ రాష్ట్రంలో లేని విధంగా 8 ఏళ్లలో 2.22 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాం. అందరికీ ప్రభుత్వ ఉద్యోగం సాధ్యం కాదు. కాబట్టి ప్రైవేటు రంగ సంస్థలను ప్రోత్సహిస్తున్నాం అని అన్నారు. జల సంరక్షణలో తెలంగాణ.. దేశానికే ఆదర్శంగా నిలిచిందని.. సిరిసిల్ల ప్రజలు ఐఏఎస్‌లకే జలసంరక్షణ పాఠాలు చెప్పే స్థాయికి ఎదిగారని కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. `దేశ జనాభాలో కేవలం 2.5 శాతం ఉన్న తెలంగాణ జీడీపీలో మాత్రం 5 శాతం అందిస్తోంది. ఈ 8 ఏళ్లలో తెలంగాణాకు కేంద్రం ఒక్క విద్యాసంస్థను కూడా కేటాయించ లేదు. ఢిల్లీ నుంచి తెలంగాణకు వచ్చి మాపై విమర్శలు చేస్తున్నారు. ముందు వాళ్లేం ఇచ్చారో తెలుసుకుంటే బాగుంటుంది’ అని కేటీఆర్ చురక అంటించారు.