Andhra PradeshNews Alert

తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న పులి

Share with

పులి అంటే అందరికి భయం ఉంటుంది. పులి సంచరిస్తుందనే వార్త తెలిస్తే ఇక కంటికి కునుకుండదు. ఎటునుండి ఎలా వచ్చి విరుచుకు పడుతుందో అనే భయాందోళనకు లోనవుతూ ఉంటారు. ఇటువంటి పరిస్థితులే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలను వేధిస్తున్నాయి. మంచిర్యాల , విజయనగరం జిల్లాల్లో పులి సంచరిస్తుందని వార్తలు వస్తున్నాయి. దాని ఉనికిని తెలియజేస్తూ అక్కడికి ఆహారం కోసం సంచరించే పశువులను చంపి ప్రజలను టెన్షన్‌కి గురిచేస్తోంది ఈ పులి.

మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం జాజుల పేట శివార్లలో పులి సంచరిస్తుందని అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అప్రమత్తమైన అధికారులు దానిని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో భాగంగానే ఎంకే వలసలో పులిని పట్టుకునేందుకు బోను ఏర్పాటు చేశారు. భయం గుప్పిట్లో కాలం వెళ్లబెడుతున్నారు అక్కడి ప్రజలు.

ఏపికి చెందిన బొండపల్లి మండలం కొత్త పనసపాడులో పులి జాడలను గ్రామస్తులు గుర్తించారు. అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉండే ఈ ప్రదేశానికి కేవలం  నాలుగు కి.మీ పరిధిలో పులి తిష్టవేసిందని గుర్తించినట్టు సమాచారమిచ్చారు. దీంతో అక్కడి అధికారులు కూడా దానిని పట్టుకునే పనిలో పడ్డారు. అయితే అడవి ప్రాంతాలను ప్రజలు ఆక్రమించి , నివాస స్థలాలుగా మార్చడమే వీటి సంచారానికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు.