Andhra PradeshHome Page Slider

ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నాల్లో ఆ నలుగురు ఎమ్మెల్యేలు

Share with

• అమరావతి రాజధాని అంశంతో ప్రధాన అజెండాగా ప్రజల ముందుకు
• తమను అవమానపరిచిన వైయస్సార్సీపి ని టార్గెట్ చేసేందుకే అమరావతి అంశం తెరపైకి
• రాజీనామా యోచనలో తాడికొండ ఎమ్మెల్యే?

ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైయస్సార్సీపీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటేశారంటూ ఆ పార్టీ నుండి సస్పెన్షన్‌కు గురైన నలుగురు ఎమ్మెల్యేలు కొత్త వ్యూహంతో ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు మరో ఏడాది కాలం మాత్రమే ఉండటంతో అమరావతి రాజధాని అంశం కూడా ఒక ప్రధాన అజెండాగా ముందుకు రానుంది. దీంతో ఈ నలుగురు ఎమ్మెల్యేలు అమరావతి రాజధాని అంశాన్ని ప్రధానంగా తమ ప్రచార అస్త్రంగా వాడుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అనేక రకాల ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే అమరావతి రాజధాని అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాలని వారు భావిస్తున్నారని ఎమ్మెల్సీ ఎన్నికల్లో వ్యతిరేకంగా ఓటు వేశారని ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి లను వైయస్సార్సీపీ ఆ పార్టీ నుండి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.

వీరంతా తెలుగుదేశం పార్టీకి అమ్ముడుపోయారంటూ వైఎస్సార్సీపీ నేతలు ఆరోపించారు. దీనిపై ఆ నలుగురు ఎమ్మెల్యేలు భగ్గుమన్నారు. తాము ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేసామే కానీ అమ్ముడు పోవాల్సిన అవసరం లేదని గట్టిగా కౌంటర్లు ఇచ్చారు. అమ్ముడుపోయారంటూ తమను అవమాన పరుస్తున్న వైఎస్సార్సీపీని టార్గెట్ చేసేందుకు అమరావతి అంశాన్ని ప్రధానంగా తెర మీదకు తేవాలని వారు భావిస్తున్నారు. ఇప్పటికే అమరావతి రాజధాని ప్రాంతానికి చెందిన తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ప్రభుత్వం పై ధ్వజమెత్తుతూ అమరావతి రైతుల పక్షాన నిలబడతానని చెప్పారు. ఎన్నికలకు ముందు గడపగడపకు తిరుగుతూ రాజధాని ఇక్కడే ఉంటుందని వైఎస్ జగన్ ఇచ్చిన హామీని అందరికీ వినిపించామని అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చేశారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. రానున్న కాలంలో అమరావతి రైతులతో కలిసి ఉద్యమిస్తామని చెప్పారు.

ఇక కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గతంలోనే అమరావతి రైతులకు మద్దతుగా మాట్లాడారు న్యాయస్థానం టు దేవస్థానం అంటూ అమరావతి రైతులు తిరుపతికి యాత్రకు వెళుతున్నప్పుడు నెల్లూరు జిల్లాలోని తన నియోజకవర్గంలో వారికి వసతి ఏర్పాటు కూడా చేశారు. అప్పుడే అమరావతి రైతుల పక్షాన నిలబడిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇప్పుడు మరింతగా ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టాలన అమరావతికి అనుకూలంగా వ్యవహరించబోతున్నారని సమాచారం. వీరితోపాటు ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కూడా అమరావతి రాజధానిపై గట్టిగా తమ వాయిస్ ను వినిపించబోతున్నారని తెలుస్తోంది.

ఇక మారిన పరిస్థితులు నేపథ్యంలో తాడికొండ ఎమ్మెల్యేగా ఉన్న ఉండవల్లి శ్రీదేవి తన పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లి ప్రభుత్వాన్ని సవాల్ చేస్తారని ప్రచారం సోషల్ మీడియాలో ఎక్కువైంది. తద్వారా అమరావతికే ప్రజలు పట్టం కడతారని నిరూపించాలని ప్రయత్నాల్లో ఆమె ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఉప ఎన్నికల్లో తాడికొండ సీటును గెలిస్తే అమరావతి రాజధాని అజెండాకు మంచి ఊపు వస్తుందని భావనలో తెలుగుదేశం కూడా ఉందనే ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా ఈ నలుగురు ఎమ్మెల్యేలు రానున్న కాలంలో ప్రభుత్వాన్ని ఏ స్థాయిలో ఇరకాటంలో పెడతారు అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.