Home Page SliderNational

తీవ్ర విషాదాన్ని మిగిల్చిన ‘షిర్డి యాత్ర’

Share with

షిర్డి ప్రయాణం ఆ భక్తులకు అంతిమయాత్రగా మారింది. షిర్డి యాత్రకు వెళ్తున్న వారి బస్సు మార్గం మధ్యలో ఘోర ప్రమాదానికి గురైంది. ఈ బస్సు వేగంగా ట్రక్కును ఢీకొనడంతో 10 మంది ఘటనాస్థలంలోనే మృత్యువాత పడ్డారు. కాగా మృతుల్లో 7గురు మహిళలు,ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ భయానక ఘటన మహరాష్ట్రలో చోటు చేసుకుంది. ఈ రోజు ఉదయం షిర్డి యాత్రికులతో వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది.

అయితే ఈ బస్సు ఠాణె జిల్లా నుంచి యాత్రికులతో షిర్డి బయలుదేరింది. కాగా నాసిక్-షిర్డి హైవేపై వెళ్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న ట్రక్కును వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది అక్కడిక్కడే మృతి చెందారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని అధికారులు స్థానిక హస్పటల్‌కు తరలించారు.కాగా క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాద ఘటనపై మహరాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ శిందే సంతాపం తెలియజేశారు. అంతేకాకుండా మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. ఈ ఘటనలో గాయపడిన క్షతగాత్రులకు ప్రభుత్వ ఖర్చులతో వైద్యం అందిస్తామని సీఎం తెలిపారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు.