NewsTelangana

వెంకటరెడ్డి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

Share with

మునుగోడు ఉపఎన్నిక కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అగ్ని పరీక్షగా మారింది. తన సోదరుడు రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ తరఫున పోటీ చేయడంతో కాంగ్రెస్‌ ఎంపీ అయిన వెంకటరెడ్డి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. తన తమ్ముడికి అండగా నిలవాలా.. కాంగ్రెస్‌ అభ్యర్థికి మద్దతివ్వాలా.. అనే సంకట స్థితిలో వెంకటరెడ్డి పడ్డారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై తిరుగుబాటు చేసిన వెంకటరెడ్డిని కాంగ్రెస్‌ అధిష్ఠానం బుజ్జగించి.. మునుగోడులో కాంగ్రెస్‌ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని సూచించింది.

రాజగోపాల్‌కు మద్దతివ్వాలంటూ కాంగ్రెస్‌ నాయకులకు ఫోన్లు

వెంకటరెడ్డి మనసు మాత్రం సోదరుడి చుట్టూనే తిరుగుతోందని తెలుస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఫోన్‌ చేసి తన సోదరుడికి మద్దతివ్వాలని కోరినట్లు వెంకటరెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. రాజగోపాల్‌కు అండగా నిలవాలని వెంకటరెడ్డి తనకు ఫోన్‌ చేసి కోరారని ఊకొండి ఎంపీటీసీ సభ్యురాలి భర్త సైదులు సంచలనాత్మక ఆరోపణ చేశారు. వెంకటరెడ్డి ప్రతిపాదనను తాను తిరస్కరించానని చెప్పారు. వెంకటరెడ్డి ఫోన్‌ చేసినట్లు మరికొంత మంది కాంగ్రెస్‌ నాయకులు కూడా చెప్పారు. కాంగ్రెస్‌లో ఉంటూ బీజేపీ అభ్యర్థికి సహకరించాలని కోరుతున్న వెంకటరెడ్డిపై పార్టీ అధిష్ఠానం క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఆరా తీస్తున్న కాంగ్రెస్‌ అధిష్ఠానం

అయితే.. ఈ ఆరోపణలను వెంకటరెడ్డి ఖండించారు. తాను ఎవరికీ అలాంటి ఫోన్లు చేయలేదని, తన పరువు తీసేందుకు కొందరు కుట్ర చేస్తున్నారని ఎదురు దాడికి దిగారు. అవసరమైతే పార్టీకి ప్రచారం చేసేందుకు సిద్ధమని చెప్పినట్లు పేర్కొన్నారు. ఎవరైనా కాంగ్రెస్‌లో ఉంటూ మరో పార్టీ కోసం పని చేయాలని కోరతారా..? అని ప్రశ్నించారు. మరోవైపు వెంకటరెడ్డిపై వచ్చిన ఆరోపణలపై కాంగ్రెస్‌ అధిష్ఠానం దృష్టి కేంద్రీకరించింది. ఆయన నిజంగానే రాజగోపాల్‌రెడ్డికి మద్దతివ్వాలంటూ కాంగ్రెస్‌ నాయకులను తప్పుదోవ పట్టిస్తున్నారా.. అనే విషయంపై ఆరా తీస్తోంది. దీంతో కాంగ్రెస్‌ నాయకుల్లో నమ్మకం కల్పించలేక.. సోదరుడికి అండగా నిలబడలేక వెంకటరెడ్డి పరిస్థితి ముందు నొయ్యి.. వెనుక గొయ్యిలా తయారైంది. ఇక రాజగోపాల్‌రెడ్డి బాటలోనే వెంకటరెడ్డికి కూడా బీజేపీలో చేరడం మినహా మరో మార్గం లేదని ఆయన అనుచరులు అంటున్నారు.