Andhra PradeshHome Page Slider

ప్రకాశం జిల్లా వివాహిత హత్యకేసులో వెలుగు చూసిన ఘోరమైన నిజాలు

Share with

ప్రకాశం జిల్లాలో నిన్న సంచలనం రేపిన వివాహిత రాధ దారుణ హత్యకేసులో ఒళ్లు గగుర్పొడిచే నిజాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో కీలక నిందితుడు ఆమె చిన్ననాటి స్నేహితుడైన కాశిరెడ్డే అని నమ్మకంగా చెప్తున్నారు ఆమె తల్లిదండ్రులు. స్నేహితుడికి సహాయం చేద్దామని నమ్మి నిలువునా మోసపోయిందామె. కాశిరెడ్డికి ఉద్యోగం పోయిందని, అతని వ్యాపారానికి అండగా నిలవాలని భర్తతో కలిసి 80 లక్షల రూపాయల అప్పు ఇప్పించింది. దానిని అతడు తిరిగి తీర్చలేదు సరికదా.. అప్పు తీర్చమంటోందనే కోపంతో ఆమెపై కిరాతకానికి పాల్పడ్డాడు. దారుణంగా హింసించి చంపేశాడు.

హత్యకు ముందు రాధను అప్పులో కొంత డబ్బు ఇస్తానంటూ, పామూరు రోడ్డులోని యలమందారెడ్డి విగ్రహం వద్దకు రమ్మన్నారు. ఆమె సాయంత్రం అక్కడకు చేరుకోగా ఒక ఎరుపురంగు కారులో వచ్చిన వ్యక్తులను చూసి ఆమె అడుగులు వెనక్కు వేశారు. సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు నమోదయ్యాయి. అనంతరం ఆమెను కారులో ఎక్కించుకుని తీసుకువెళ్లారు. ఆ కారులో వచ్చిందెవరు?  కాశిరెడ్డి ఆ సమయంలో ఎక్కడ ఉన్నాడు? ఆమె ఎందుకు ఆ కారు ఎక్కింది? అనే విషయాలు సస్పెన్సుగా మారాయి. కారులో అపరిచిత వ్యక్తులను చూసి భయపడిందా ? అందుకే వెనుకడుగు వేసిందా?  వారు కిరాయి హంతకులా అనే విషయాలు తేల్చవలసి ఉంది. ఆమె శరీరంపై సిగరెట్ వాతలు, బండతో తలను మోదిన ఆనవాళ్లు ఉన్నాయి. దారుణంగా హత్య చేసి, యాక్సిడెంట్‌గా చిత్రీకరించే ప్రయత్నంలో కారును ఆమె గుండెలమీదుగా పోనిచ్చారు. ఆమెకు బ్రతికుండగానే నరకం చూపించారా దుర్మార్గులు. ఆమె  కాల్ డేటాను బట్టి, హత్యకు ముందు ఎవరితో ఎంత సేపు మాట్లాడింది అనే వివరాలు సేకరిస్తున్నారు. కాశిరెడ్డి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు పోలీసులు.