Andhra PradeshHome Page Slider

సంచలనాలకు వేదికగా టీడీపీ మహానాడు మారుతుందా?

Share with

వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న అధినేత చంద్రబాబు
మహానాడు వేదికగా పొత్తులపై క్లారిటీ ఇస్తారని ప్రచారం
కీలక నేతల చేరికలకు ప్లానింగ్
ఎన్నికల ఏడాది కావడంతో క్యాడర్‌లో జోష్ నింపే ఆలోచన

ఏపీలో తెలుగుదేశం పార్టీ, మే 27,28 తేదీల్లో రాజమహేంద్రవరంలో నిర్వహించే మహానాడు కార్యక్రమంలో కీలక నిర్ణయాలు, ప్రకటనలు చేయనుంది. పార్టీకి పూర్వ వైభవాన్ని తెచ్చేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పుడు కొత్త వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. ఎన్నికలవేళ పార్టీలో కొత్త జోష్ నింపేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం పూర్తిగా వచ్చేసింది. ఎన్నికల ఏడాదిలో జరుగుతున్న మహానాడు కార్యక్రమం తెలుగుదేశం పార్టీకి ఎంతో కీలకం కానుంది. ఈ వేదికగా సంచలన నిర్ణయాలు ప్రకటనలు చేసేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు సిద్ధమవుతున్నారు. పొత్తుల నుంచి చేరికల వరకు మహానాడు వేదికయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

వైయస్సార్సీపీ రెబల్స్‌తో పాటుగా గతంలో పార్టీ వీడిన కొందరు ముఖ్యమైన నేతలను పార్టీలోకి చేర్చుకునేందుకు మహానాడు ముహూర్తంగా ఫిక్స్ చేశారు. అదే సమయంలో పొత్తులపై కూడా ప్రకటన చేసేందుకు మహానాడు వేదికగా మార్చుకోవాలని అధినేత నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక ఎన్నికల్లో అధికార వైయస్సార్సీపీని ఢీకొట్టేందుకు ప్రధాన అస్త్రాలను కూడా చంద్రబాబు సంధించనున్నారు. ముఖ్యంగా సంక్షేమ పథకాలను అస్త్రాలుగా మలవాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. వైయస్సార్సీపీ ఇస్తున్న సంక్షేమానికి రెట్టింపు సంక్షేమం అందిస్తామన్న ప్రకటనలు ఇప్పటికే చేసిన తెలుగుదేశం పార్టీ అధిష్టానం, దీనిపై ఒక స్పష్టమైన ప్రకటన మహానాడులో చేయనుంది. వివిధ వర్గాల ప్రజలను పార్టీ వైపు తిప్పుకునేందుకు వారిపై వరాలజల్లు కురిపించే అవకాశాలు ఉన్నాయి.

ఎన్నికల్లో యువతను కీలకంగా భావిస్తున్న తెలుగుదేశం పార్టీ వారికి స్పష్టమైన హామీలు ఇవ్వనుంది. మహానాడు వేదికగా పార్టీలో కీలక నేతల ఎక్కువమంది చేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలానే పొత్తులపై కూడా మహానాడు వేదికగా క్యాడర్‌తో పాటు నేతలకు కూడా స్పష్టత ఇచ్చే అవకాశముంది. ఇప్పటికే జనసేనతో పొత్తు ఖాయంగా కనిపిస్తున్న నేపథ్యంలో మహానాడు ముగింపు సభలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కీలక ప్రకటనలు చేస్తారనే అభిప్రాయం నేతలు నుంచి వ్యక్తం అవుతుంది. కర్నాటక ఎన్నికల అనంతరం చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరొకసారి భేటీ కానున్నారు. ఆ సమయంలో పొత్తులపై దాదాపు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో మహానాడు సంచలనాలకు వేదిక అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి రావడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న చంద్రబాబు నాయుడు అందివచ్చిన అవకాశాన్ని దేనినైనా వదులుకోవడానికి సిద్ధంగా లేరు. గత ఏడాది ఒంగోలు కేంద్రంగా నిర్వహించిన మహానాడు సక్సెస్ కావడం ద్వారా పార్టీలో మరోసారి ఊపు కనిపించింది. ఇప్పుడు ఎన్నికల ఏడాదిలో నిర్వహిస్తున్న మహానాడుతో కార్యకర్తల్లో మరింత జోష్ పెంచి వారిని ఎన్నికల సంగ్రామానికి సిద్ధం చేసే విధంగా కొత్త వ్యూహాలను చంద్రబాబు సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా వైఎస్సార్సీపీని నైతికంగా దెబ్బతీసే ఎత్తుగడలను అమలు చేస్తున్నారు. ఇక నిత్యం నేతలు ప్రజల్లో ఉండే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.