Andhra PradeshNews Alert

అమరావతి రైతుల మహా పాదయాత్ర 2.0 ప్రారంభ తేదీ ఖరారు

Share with

అమరావతి రైతులు తలపెట్టిన మహా యజ్ఞం మహా పాదయాత్ర 2.0 కు ముహూర్తం ఖరారైంది. ఇన్నాళ్లూ ఏదోరకంగా అడ్డుకుంటూ వచ్చిన ప్రభుత్వం హైకోర్టు తీర్పుతో ఇక అడ్డుకట్ట  వేయలేకపోయింది. ఉద్యమం ప్రారంభమై 1000 రోజులు చేరుకుంటున్న సందర్భంగా ఈ నెల 12న తుళ్లూరు మండలం వెంకటపాలెంలో ఈ మహా పాదయాత్ర మొదలవుతుంది. దీనికి వేదపండితుల ఆశీర్వాదంతో 12 తెల్లవారుజాము 5 గంటలకు ముహూర్తం పెట్టారు. వెంకటపాలెంలోని శ్రీవేంకటేశ్వరుని ఆలయంలో పూజా కార్యక్రమాలు ప్రారంభిస్తారు. అనంతరం ఉదయం 6 గంటలకు పాదయాత్రకోసం ప్రత్యేకంగా చేసిన శ్రీవారి రథాన్ని ఆలయం నుంచి వెంకటపాలెం గ్రామంలోకి తీసుకువస్తారు. అప్పుడు లాంఛనంగా పాదయాత్రను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి వైసీపీ మినహా అన్ని రాజకీయపార్టీల నేతను, అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని రైతు ఐకాస సమన్వయ కమిటీ సభ్యులు ఆహ్వానిచారు. దీనిలో పాల్గొ  నేందుకు టీడీపీ,బీజేపీ, జనసేన, సీపీఎం, కాంగ్రెస్, అప్ తదితర పార్టీలు అంగీకరించాయి. వెంకటపాలెం నుండి కృష్ణాయపాలెం, పెనుమాక, ఎర్రబాలెం మీదుగా మంగళగిరికి పాదయాత్ర చేరుకుంటుంది.  ఈ మహా పాదయాత్ర 2.0 ను విజయవంతం చేయాలని అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని రైతు ఐకాస సమన్వయ కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు.

ఈ పాదయాత్రలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కమిటీలు ఏర్పాటు చేశారు. ఆహారం, నీరు కమిటీలు ఏర్పాటు చేసుకున్నారు.

పాదయాత్రలో పాల్గొనే వారి వివరాలను పోలీసులకు అందజేశారు. మొత్తం 600 మంది పేర్లను, వారి ఆధార్ వివరాలను డీజీపీ కార్యాలయంలో శాంతి, భద్రతల విభాగం ఏఐజీ అమ్మిరెడ్డికి అందజేశారు.