Home Page SliderTelangana

మేడిగడ్డ కుంగిన నష్టాన్ని అధికార పార్టీయే భరించాలి

Share with

మేడిగడ్డ రిజర్వాయర్ వంతెన కుంగిన ఘటనపై బీజేపీ ఎంపీ బండి సంజయ్ పలు విమర్శలు చేశారు. మొత్తం నష్టాన్ని ఆ పార్టీయే భరించాలన్నారు.

కరీంనగర్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ వంతెన కుంగిన ఘటనపై బీజేపీ ఎంపీ బండి సంజయ్ స్పందిస్తూ పలు కామెంట్స్‌ చేశారు. ముఖ్యమంత్రి కుటుంబమే దీనికి బాధ్యత వహించాలని.. జరిగిన నష్టాన్ని వారి నుంచే వసూలు చేయాలని డిమాండ్ చేశారు. కరీంనగర్‌లోని మహాశక్తి ఆలయంలో జమ్మిపూజ చేసిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. మేడిగడ్డ రిజర్వాయర్ వంతెన కుంగిపోవడం పట్ల దేశ ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. కాళేశ్వరానికి జాతీయ హోదా ఇచ్చి ఉంటే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. కమీషన్ల మీద ఉన్న శ్రద్ధ నాణ్యతా ప్రమాణాల పట్ల లేనందునే కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇటువంటి దుర్గతి పట్టిందన్నారు. రాజకీయ పార్టీల నేతలు ప్రాజెక్టును సందర్శిస్తామంటే ఆనాడు ఎందుకు అడ్డుకున్నారో ఇప్పుడు అర్థమవుతోంది. మళ్లీ అధికారంలోకి రాలేరనే అనుమానంతో నాణ్యతకు తిలోదకాలు ఇచ్చారన్నారు. ఈ ఘటనపై ఇప్పటికే తమ పార్టీ కేంద్రానికి ఫిర్యాదు చేసిందన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టుపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నేడు కేంద్రం నుండి నిపుణుల కమిటీ రాష్ట్రానికి రానుంది. బీజేపీ అభ్యర్థుల రెండో జాబితాపై స్పందిస్తూ.. దసరా తర్వాత చర్చించి ప్రకటిస్తామని ఆయన తెలిపారు.