Andhra PradeshHome Page Slider

అత్యంత ప్రతిష్టాత్మకంగా మహానాడు కార్యక్రమం

Share with

ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న గోదావరి జిల్లాల ఇన్చార్జిలు
పదిహేను లక్షల మంది వరకు రావచ్చని అంచనా
గోదావరి జిల్లాలపై కన్నేసిన చంద్రబాబు
ఈనెల 27 ,28 తేదీల్లో రాజమండ్రిలో మహానాడు కార్యక్రమం

ఏపీలో మరో ఏడాదిలో సాధారణ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ముందస్తు ఎన్నికల ప్రచారం కోసం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గోదావరి జిల్లాల పైన కన్నేశారు. దీనిలో భాగంగా ప్రతి రెండేళ్లకొకసారి తెలుగుదేశం పార్టీ భారీ ఎత్తున మహానాడు కార్యక్రమం నిర్వహించడం ప్రతి ఏటా మినీ మహానాడు జరపటం ఆనవాయితీగా వస్తోంది. రెండేళ్లు కరోనా కారణంగా మహానాడు కార్యక్రమం జరగలేదు. దీంతో ఈసారి మహానాడు కార్యక్రమాన్ని నభూతో న భవిష్యతి అన్న రీతిలో నిర్వహించటానికి తెలుగుదేశం పార్టీ గోదావరి జిల్లాల ప్రజలను ఆకర్షించేందుకు ఎత్తుగడవేసింది. గతంలో ఒకసారి రాజమండ్రిలో మహానాడు జరిగింది. అలానే ఈనెల 27,28 తేదీల్లో రాజమండ్రి రూరల్ వేమగిరి వద్ద మహానాడు ఏర్పాట్లు చక చక జరిగిపోతున్నాయి. మహానాడు నిర్వహణ కోసం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు 15 కమిటీలు కూడా నియమించారు. ఏ కమిటీకి ఆ కమిటీ బాధ్యత చూస్తోంది.

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రవాసాంధ్రులు కూడా ఈ కార్యక్రమానికి వస్తారని భావించి అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే రాజమండ్రి నగరం తో పాటు పరిసర ప్రాంతాల్లో ఉన్న అన్ని కళ్యాణ మండపాలు అదేవిధంగా ప్రైవేటు ఫంక్షన్ హాల్‌లు, హోటళ్లు బుక్ చేశారు. చంద్రబాబు నాయుడు భారీ ఎత్తున ఈ మహానాడు కార్యక్రమం నిర్వహించడం ద్వారా అటు జనసేనతో పొత్తుకు లైను క్లియర్ చేసుకోవడమే కాకుండా గోదావరి జిల్లాల ఓటర్లను ఆకట్టుకునే దిశగా ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నారని చెబుతున్నారు. అంతేకాకుండా తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ ఇటీవల కాలంలో పుంజుకున్న నేపథ్యంలో తెలంగాణ నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రతినిధులు వస్తున్నారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో తెలుగుదేశంతో పొత్తుకు ప్రయత్నిస్తుందన్న వార్తలు వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో రెండు రాష్ట్రాలలో తెలుగుదేశం పార్టీ హవా చాటేందుకు సైకిల్ సత్తా చూపేందుకు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మహానాడు కార్యక్రమాన్ని తీర్చిదిద్దుతున్నారు.

ముఖ్యంగా ఎన్టీఆర్ చిత్రాలతో కూడిన గ్యాలరీ, మరోపక్క సాంస్కృతిక కార్యక్రమాలు, గోదావరి జిల్లాల ప్రజల యాసతో కూడిన ప్రత్యేక కార్యక్రమాలు, అలాగే అక్కడ కొలువు తీర పుణ్యక్షేత్రాల గురించి ప్రత్యేక ప్రదర్శన ఏర్పాట్లు, చేస్తున్నారు. ఇక ఈ రెండు రోజులు కూడా ఉదయం సాయంత్రం టిఫిన్లు మధ్యాహ్నం రాత్రి భోజనాలు పూర్తిగా గోదావరి రుచులతో ఉండేలా కమిటీకి సూచనలు జారీ చేశారు. గోదావరి జిల్లాలకు చెందిన 34 నియోజకవర్గాల తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఇన్చార్జులు ప్రతినిధులు ఏర్పాట్ల పర్యవేక్షణను తమ భుజస్కందాలపై వేసుకున్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యతను అప్పగించారు. హైకోర్టు జీవో నెంబర్ ఒకటిని కొట్టి వేసినప్పటికీ దాన్ని అడ్డుపెట్టుకొని ఇప్పటికీ పోలీసులు వేధిస్తున్న నేపథ్యంలో ఎలాంటి వేధింపులు లేకుండా రెండు తెలుగు రాష్ట్రాలు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఆటంకం లేకుండా పార్కింగ్ తో సహా సకల సదుపాయాలతో మహానాడు వేదిక సిద్ధమవుతోంది.

వర్షం వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటర్ ప్రూఫ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నారు. అంగరంగ వైభవంగా లక్షలాదిమందితో మహానాడు నిర్వహించి రెండు రాష్ట్రాలకు తెలుగుదేశం పార్టీ హవా చాటి చెప్పేందుకు ఇతర పార్టీలను ఆకర్షించేందుకు తెలుగుదేశం జనసేన, భారతీయ జనతా పార్టీ పొత్తులకు ఎవరు ఎలాంటి అడ్డుపెట్టకుండా ఉండేందుకు ఈ మహానాడు ను చంద్రబాబు వేదికగా ఎంచుకున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు అనధికారికంగా ఖరారు అయింది. భారతీయ జనతా పార్టీ నుంచి పొత్తులపై ఉలుకు పలుకు లేదు. ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలుగుదేశం పార్టీతో కలిసేందుకు సుముఖంగా లేరు. కానీ తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఓటు బ్యాంకు ఉన్న నేపథ్యంలో బీజేపీకి కచ్చితంగా తెలుగుదేశం పార్టీ సహకారం అవసరం అందుకోసం కేంద్ర పెద్దలు భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం పార్టీ పొత్తుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద మహానాడు ద్వారా తెలుగుదేశం ఎన్నికల సమర శంఖారావం పూరించనుంది.