Home Page SliderNational

అంబులెన్స్‌కు డబ్బుల్లేక పసికందు మృతదేహం బ్యాగులో పెట్టిన తండ్రి

Share with

వెస్ట్‌బెంగాల్‌లో ఒక అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఐదు నెలల పసిబిడ్డను కోల్పోయిన బాధను దిగమింగి, పేదవాడైన ఆ తండ్రి అంబులెన్సుకు డబ్బులేక బస్సులో ప్రయాణించాడు. ఎవరికీ కనిపించకుండా బిడ్డ మృతదేహాన్ని బ్యాగులో దాచాడు. రెండువందల కిలోమీటర్లు ప్రయాణం చేసి, స్వగ్రామం చేరాడు. పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర దినాజపూర్ జిల్లాలో కలియాగంజ్ అనే ఊరిలోని అసిమ్ దేవశర్మ వలసకూలిగా పనిచేస్తున్నాడు. అతనికి ఐదునెలల వయస్సున్న  కవల కుమారులు ఉన్నారు. వారిద్దరికీ ఆరోగ్యం బాగోలేకపోవడంతో సిలిగురిలోని ఉత్తర బెంగాల్ మెడికల్ కాలేజి ఆసుపత్రిలో చేర్చారు. ఒక శిశువు ఆరోగ్యం బాగుపడడంతో అతని భార్య బిడ్డను తీసుకుని ఊరికి వెళ్లింది.

మరో బిడ్డ పరిస్థితి విషమించి మరణించాడు. దీనితో బిడ్డను స్వగ్రామం తీసుకెళ్లడానికి అంబులెన్స్ కోసం అడుగగా, వారు 8 వేల రూపాయలు డిమాండ్ చేశారు. అప్పటికే పిల్లల వైద్యం కోసం  తలకు మించి ఖర్ఛు చేసిన శర్మ వద్ద డబ్బులేక చిన్నారి మృతదేహాన్ని బ్యాగులో దాటిపెట్టి బస్సులో 200 కిలోమీటర్లు ప్రయాణం చేసి స్వగ్రామం చేరుకున్నాడు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ప్రతిపక్ష బీజేపీ నేతలు విమర్శలు కురిపించారు. బెంగాల్ ప్రభుత్వ స్వస్థ్య సాథి అనే పథకాన్ని తప్పుపట్టారు. దీనితో తృణమూల్ కాంగ్రెస్ నేతలు కూడా మాటలయుద్ధం మొదలుపెట్టారు.