Telangana

తండ్రి ఘరానా స్మగ్లర్- కొడుకు అటవీశాఖలో అధికారి

Share with

తండ్రి కలప స్మగ్లర్, కొడుకేమో అటవీ శాఖ అధికారి. ఇలాంటి కథలు మామూలుగా సినిమాలలో చూస్తూ ఉంటాం. కానీ మెదక్ జిల్లా రామాయం పేట అటవీ ప్రాంతంలో ఈ సంఘటన నిజంగా జరిగింది. ఇక్కడ స్మగ్లింగ్ చేస్తున్న కొందరిని అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు.  అడవిలో టేకు చెట్లను నరికి తరలిస్తున్న ప్రగతి ధర్మారం గ్రామానికి చెందిన గాండ్ల బాలయ్య, నక్కని స్వామి, నక్కని చిన్నస్వామిలను అటవీ అధికారులు బుధవారం సాయంత్రం పట్టుకున్నారు. వారిని విచారించగా అదే గ్రామానికి చెందిన బొడ్డు నర్సింలు దీనికి సూత్రధారి అని తెలిసింది. పొలాల సమీపంలో, వాగు సమీపంలో దాచిన 25 దుంగలను గురువారం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నలుగురిని అరెస్టు చేయగా, వారిలో ప్రధాన సూత్రధారి అయిన బొడ్డు నర్సింలు కుమారుడు అటవీశాఖలో డిప్యూటీ రేంజి అధికారిగా విధులు నిర్వహిస్తున్నట్లు గ్రామస్థుల ద్వారా తెలిసింది. అయితే అటవీ అధికారులు ఈ విషయాన్ని ధృవీకరించలేదు. వీరిలో బాలయ్య గతంలో అటవీ శాఖలో వాచర్‌గా పనిచేశాడని, ఆ అనుభవంతో ఈ స్మగ్లింగ్‌లకు పాల్పడుతున్నాడని సమాచరం లభించింది. వీరు ఎడ్ల బండిపై, కలపను నర్సింలు ఇంటికి తీసుకురాగా, అతడు సిద్ధిపేట జిల్లా ములుగుకు తీసుకువస్తుంటాడని తెలిసింది.