Home Page SliderTelangana

కామారెడ్డి పైనే నేతల కన్ను

Share with

గులాబీ దళపతి పోటీ చేస్తానని ప్రకటించినప్పటి నుండి అందరి చూపు కామారెడ్డి నియోజకవర్గం పైనే నెలకొంది. నామినేషన్‌కు ముందే రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. కాంగ్రెస్ నుంచి పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పోటీచేయనున్నారనే ప్రచారం ఊపందుకుంది. బీజేపీ తరఫున బరిలో ఉంటామని తొలుత ముఖ్య నేతలు ప్రకటించినప్పటికీ అధిష్ఠానం స్థానికుడైన కాటిపల్లి వెంకట రమణారెడ్డినే అభ్యర్థిగా ఖరారు చేసింది. మాస్టర్‌ప్లాన్ బాధిత రైతులకు మద్దతుగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.

   గతానికి భిన్నంగా కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం పలు సర్వేల ద్వారా సేకరించిన సమాచారంతో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించింది. మాజీ మంత్రి షబ్బీర్అలీ అభ్యర్థిత్వాన్ని ఫస్ట్ లిస్ట్‌లోనే ఉంటుందనే భావించిన పార్టీ శ్రేణులు. అధిష్ఠానం వ్యూహాత్మకంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కామారెడ్డి నియోజకవర్గం నుండి బరిలోకి దింపేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.

   నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించింది. నియోజకవర్గ స్థాయి సమన్వయ కమిటీని నియమించడంతో పాటు పోలింగ్ కేంద్రాల బాధ్యతలను సీనియర్ నేతలకు అప్పగించింది. ఇంటింటి ప్రచారం చేపట్టేందుకు 100 మంది ఓటర్లకో ఇన్‌ఛార్జిని నియమించింది. మంత్రి కేటీఆర్ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో గ్రామాల వారీగా సమస్యలు గుర్తించి నియోజకవర్గానికి ప్రత్యేక మేనిఫెస్టో రూపొందించాలని ముఖ్య నేతలకు నిర్దేశించారు.

ప్రచారం ప్రారంభం – బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకట రమణారెడ్డి కొన్నిరోజులుగా నియోజకవర్గంలో సొంత నిధులతో పలు అభివృద్ధి పనులు చేస్తూ ప్రజల ముందుకెళ్తున్నారు. రూ.150 కోట్ల సొంత నిధులను నియోజకవర్గ అభివృద్ధికి వెచ్చిస్తానని చెబుతూ ప్రత్యేక మేనిఫెస్టో రూపొందించి క్షేత్రస్థాయి ప్రచారం ప్రారంభించారు.

   కాంగ్రెస్ శ్రేణులు సైతం మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఆధ్వర్యంలో ఆరు గ్యారంటీలతో ఇంటింటి ప్రచారం చేపట్టారు. వివిధ పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలను పార్టీలోకి ఆహ్వానిస్తూ బలోపేతం అయ్యేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

చేరికలతో రాజకీయ సందడి నెలకొంది – ముఖ్యనేతలు బరిలో దిగుతుండడంతో సాధారణ ప్రజలు సైతం ఫలితంపై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. తమ అభీష్టాలకు అనుగుణంగా కార్యకర్తలు  పార్టీల్లో చేరుతున్నారు. తటస్థులు సైతం ప్రధాన పార్టీల్లో చేరుతుండడంతో నియోజకవర్గంలో రాజకీయ సందడి నెలకొంది.