Andhra PradeshHome Page Slider

పార్లమెంటుకు పాకిన ఏపీ దొంగఓట్ల వ్యవహారం…ఎంపీ జయదేవ్ ఆగ్రహం

Share with

ఏపీలోని దొంగఓట్ల, ఓటర్లజాబితాలోని అక్రమాలపై పార్లమెంటులో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ తన వాదనలు వినిపించారు. కేంద్రఎన్నికల కమిషనర్ల నియామకం గురించిన చర్చలో ఆయన ఈ విషయం లేవనెత్తారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇష్టారాజ్యంగా ఓట్లు తొలగిస్తున్నారని, దొంగఓట్లు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల సంఘం ఆదేశాలను ఏపీ ప్రభుత్వం పెడచెవిన పెడుతోందని,  ఏపీలో వాటిని అమలు చేయడం లేదని పేర్కొన్నారు. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించడం ఈసీ కర్తవ్యం అన్నారు. ఓటర్ల జాబితాను అవకతవకలుగా తయారు చేస్తున్నారని, ఈసీ ఆదేశాలను డీఆర్‌వోలు, స్థానిక సిబ్బంది పట్టించుకోవడం లేదని విమర్శించారు. 13 లక్షలకు పైగా దొంగఓట్లు ఉన్నాయని ఎన్నికల సంఘం అధికారులే చెప్పినా, అందుకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవడం లేదన్నారు. స్థానికులతో సంబంధం లేని అధికారుల పర్యవేక్షణలో ఓటర్ల జాబితా రూపొందించాలని డిమాండ్ చేశారు. కేంద్రప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకుని పారదర్శకమైన ఓటర్ల జాబితా రూపొందించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఏపీలో ప్రజాస్వామ్య పరిరక్షణ కేంద్రప్రభుత్వ బాధ్యత అన్నారు.