Home Page SliderInternational

ఆఫ్రికా నుండి కొత్త ఖండం పుట్టుక

Share with

ఆఫ్రికా నుండి 8వ ఖండం రాబోతోందని అంచనాలు వేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఆఫ్రికా ఖండంలోని భూమి నిలువునా చీలుతోంది. ఈ భూభాగం దూరం జరిగి భవిష్యత్తులో కొత్తఖండం ఏర్పడుతుందని అంచనా. భూఉపరితలంలో నిరంతరం మార్పులు జరుగుతూనే ఉంటాయి. భూమి మొత్తం 12 ఫలకాలు కలిగి ఉంది. కొన్ని లక్షల సంవత్సరాల క్రిందట ఇవన్నీ ఒకే పెద్ద టెక్టానిక్ ప్లేటుగా ఉండి, ఒకే ఖండంగా ఉండేది. భూపటలం క్రింద పాక్షిక ద్రవం పై కదులుతూ ఉండే ఈ ఫలకాల ఘర్షణ కారణంగానే భూకంపాలు,సునామీలు, అగ్ని పర్వతాల విస్ఫోటం ఏర్పడతాయి. తద్వారా లోయలు, పర్వతాలు, సరస్సులు ఏర్పడతాయి.

అయితే ఇది నిదానంగా కొన్ని లక్షల సంవత్సరాలలో జరిగే ప్రక్రియ. ప్రస్తుతం ఆఫ్రికాఖండం తూర్పు భాగం రెండుగా చీలిపోతోందని ఆఫ్రికాలోని నైరోబీ విశ్వవిద్యాలయం పరిశోధనలు తెలియజేస్తున్నాయి. ఆఫ్రికా తూర్పున ఉన్న ఇథియోపియా ఎడారిలో దాదాపు 56 కిలోమీటర్ల మేర భారీ పగుళ్లు ఉన్నాయి. కెన్యాలో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. ఈ చీలికల వల్ల సోమాలియా, ఇథియోపియా, టాంజానియా, కెన్యాలోని కొన్ని భాగాలు కలిసి భవిష్యత్తులో కొత్త ఖండంగా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. మధ్యలోని లోయలలోకి గల్ఫ్ ఆఫ్ ఏడెన్, ఎర్రసముద్రం నీరు కలిసి కొత్త సముద్రం ఏర్పడే అవకాశం ఉంది. దీనికి మరొక 50 లక్షల సంవత్సరాలు పట్టవచ్చు. అయితే ఖండాల గురించి పరిశోధనలు చేయడానికి ఈ పరిణామాలు తోడ్పడతాయని అంచనాలు వేస్తున్నారు.