Andhra PradeshHome Page Slider

బీజేపీతో పొత్తు వద్దంటున్న తెలుగు తమ్ముళ్లు-పునరాలోచనలో చంద్రబాబు

Share with

ఏపీలో ముఖ్యపార్టీలు ఎన్నికలకు రాకెట్ స్పీడ్‌తో రెడీ అవుతున్నాయి. రకరకాల పథకాల పేరుతో ముఖ్యమంత్రి జగన్, వారాహి యాత్రతో పవన్, పాదయాత్ర పేరుతో లోకేష్ ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని తిరిగేస్తున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పునర్వైభవం తీసుకువచ్చి కోల్పోయిన అధికారాన్ని తిరిగి దక్కించుకోవాలని చంద్రబాబు నాయుడు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పొత్తులపై కూడా ఆయన పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది.

తెలుగు తమ్ముళ్లు మాత్రం జనసేనతో పొత్తుకు అంగీకరిస్తున్నప్పటికీ భారతీయ జనతా పార్టీతో మాత్రం పొత్తులకు అంగీకరించని పరిస్థితి కనపడుతుంది. దీనితో చంద్రబాబు డైలమాలో పడ్డారు. ఇప్పటివరకు  పొత్తులతో ఎన్నికలకు వెళ్లాలని భావించిన చంద్రబాబు నాయుడు ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఈ అంశంపై ఆచితూచి అడుగులు వేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కూడా కర్ణాటక ఫలితాలను పునరావృతం చేయాలన్న సంకల్పం లో చంద్రబాబు నాయుడు ఉన్నారు.అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఎన్నికల తాయలాలనే ఇక్కడ నమూనాగా తీసుకొని మహానాడు వేదికగా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. సంక్షేమమే ప్రధాన ఎజేండాగా ముందుకు వెళ్లాలన్న లక్ష్యంతో చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే సూపర్ సిక్స్ పాలసీలను భవిష్యత్తు గ్యారెంటీ ద్వారా మినీ మేనిఫెస్టోలో ప్రకటించారు. మహిళలు యువత రైతులను ఆకర్షించేలా పథకాల రూపకల్పన చేసి చంద్రబాబు ప్రకటించారు. ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో పొత్తులు ఇతర ఎన్నికల  అంశాల పై ముఖ్య నేతలతో చంద్రబాబు నాయుడు అంతరంగిక సమావేశాలు నిర్వహిస్తూ ఎన్నికలకు సమాయత్తం అవుతున్నారు.