Home Page SliderTelangana

తెలంగాణ వీఆర్‌ఏ వ్యవస్థ రద్దు…వీఆర్‌ఏలు హర్షం

Share with

భూస్వామ్య వ్యవస్థను గుర్తు చేసే వీఆర్‌ఏ విధానాన్ని శాశ్వతంగా రద్దు చేస్తూ రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై వీఆర్‌ఏలు హర్షం వ్యక్తం చేశారు. నీరటి, మస్కూర్, లష్కర్ వంటి పేర్లతో కూడిన ఈ ఉద్యోగాలు భూస్వామ్య వ్యవస్థకు చిహ్నాలని, తరతరాలుగా గ్రామాలలో సేవ చేస్తున్న వీరి త్యాగపూరిత సేవ చాలా గొప్పదని భావించింది రాష్ట్రప్రభుత్వం.  వారికి ప్రభుత్వ ఉద్యోగ భద్రత కల్పిస్తూ వారిని ప్రభుత్వంలో వివిధ శాఖలకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీరి క్రమబద్దీకరణ అంశంపై ఆదివారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 20,555 మంది వీఆర్‌ఏలు పనిచేస్తున్నారు. వీరిలో నిరక్షరాస్యులు, ఏడో తరగతి నుండి డిగ్రీ వరకూ చదివినవారు ఉన్నారు. వీరి విద్యార్హతలను బట్టి వారి ప్రభుత్వ ఉద్యోగ కేటగిరీలను నిర్ణయిస్తారు. 61 ఏళ్లు దాటిన వారి వారసులకు ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామన్నారు. ఇంకా చనిపోయిన వీఆర్‌ఏ వారసులు, విద్యార్హతల వివరాలను కూడా సేకరిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఈ సందర్భంగా వీఆర్‌ఏ జేఏసీ నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ వీఆర్‌ఏలలో డిగ్రీ అర్హత గల వారిని జూనియర్ అసిస్టెంట్లుగానూ, పురపాలక వార్డు అధికారులుగానూ నియమిస్తారు. ఇంటర్ అర్హత గలవారిని రికార్డు అసిస్టెంట్లుగానూ, పదవ తరగతి వారిని సబార్డినేట్లుగానూ, హెల్పర్లుగానూ నియమిస్తారు.