News

చీరాల నుండి రాములోరి కళ్యాణానికి “కోటి గోటి తలంబ్రాలు”

Share with

సీతారాముల కళ్యాణం అంటే సాక్షాత్తూ లోక కళ్యాణమే. ‘మా సీతమ్మ పెళ్లికూతురాయెనే’ అంటూ ఎక్కడెక్కడి నుండో భద్రాచల రాముల వారి కళ్యాణానికి తరలి వస్తారు.ఈ కల్యాణానికి ఎంతటి ఖ్యాతి ఉందో.. ఆ కల్యాణంలో వినియోగించే గోటి తలంబ్రాలకు అంతే ప్రత్యేకత వుంది.ఆ కల్యాణ వేడుకల్లో ఆ తలంబ్రాలను తాకితేనే ఎంతో పుణ్యమని భావిస్తారు భక్తులు. అటువంటి ఆ జానకీ రాముల కల్యాణానికి వినియోగించే కోటి గోటి తలంబ్రాలను స్వయంగా తయారు చేస్తూ భక్తి పారవశ్యంలో మునిగి తేలుతున్నారు బాపట్ల జిల్లా చీరాల వాసులు.

శ్రీరామనవమి సందర్భంగా గోటితో వడ్లను వలిచి తలంబ్రాల బియ్యాన్ని తయారు చేసే మహత్కర కార్యక్రమాన్ని గత పది సంవత్సరాలుగా కొనసాగిస్తున్నారు ఈ  శ్రీ రఘురామ భక్త సేవాసమితి సభ్యులు.  పట్టణ వాసులను భాగస్వాములను చేసుకొని రామనామ జపం చేస్తూ ఆరు నెలలపాటు కష్టపడి సుమారు 15 వేల కిలోల వడ్లను నిష్టగా భక్తి శ్రద్ధలతో గోటితో ఒలిచి.. ప్రత్యేకంగా మహిళలచే నియమ నిష్ఠ లతో పసుపు దంచి.. రాములోరి కల్యాణ వేడుకలకు ప్రత్యేకత సంతరించుకున్న ఎర్ర తలంబ్రాలు తయారు చేయడం ఈ భక్త సమాజం వారి ప్రత్యేకత..అలా తయారు చేసిన తలంబ్రాలతో పాటు ఆ సీతారాముల వారి కల్యాణానికి నెమలి ఈకలతో, ఒట్టి వేలితో ప్రత్యేకంగా తయారు చేసిన దండలు… అమ్మవారి కి పసుపు కుంకుమ చీరాల నుండి భద్రాద్రి కి తరలించి స్వామి వారికి సమర్పించటం ఆనవాయితీగా వస్తోంది. వీటిని ఈ నెల 30 వ తేదీ కన్నుల పండుగగా జరిగే ఆ సీతారాముల కళ్యాణానికి సమర్పిస్తారు.ఇంతటి మహత్తరమైన కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని, ఇదంతా తమ పూర్వజన్మ సుకృతమని వారంటున్నారు.