Home Page SliderNational

సూరజ్‌ పంచోలీ నిర్దోషి, జియాఖాన్‌ ఆత్మహత్య కేసులో కోర్టు తీర్పు

Share with

నటి జియాఖాన్ ఆత్మహత్యతో మరణించిన పదేళ్ల తర్వాత, ముంబైలోని ప్రత్యేక సీబీఐ కోర్టు ఈరోజు ఆమె ప్రియుడు, నటుడు సూరజ్ పంచోలీని నిర్దోషిగా ప్రకటించింది. జియా ఖాన్, 25, జూన్ 3, 2013న ముంబైలోని తన జుహూ ఇంట్లో ఉరేసుకుని మృతి చెందారు. జియా రాసిన ఆరు పేజీల లేఖ ఆధారంగా సూరజ్ పంచోలీని పోలీసులు అరెస్టు చేసి, ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు అతనిపై కేసు నమోదు చేశారు. జియా హత్యకు గురైందని ఆమె తల్లి రబియా ఖాన్ ఆరోపించారు. స్పెషల్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) కోర్టు జడ్జి AS సయ్యద్ నిందితులను జీవితంలో ముందుకు సాగాలని సూచించారు. 32 ఏళ్ల పంచోలీని సరైన సాక్ష్యాధారాలు లేకపోవడం వల్ల నిర్దోషిగా తేల్చారు. ఆదిత్య పంచోలి, జరీనా వహాబ్‌ల కుమారుడు సూరజ్ పంచోలి దోషిగా తేలితే 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. తీర్పు కోసం అతని తల్లి అతనితో పాటు కోర్టుకు వచ్చింది.

పంచోలీ ఈ కేసులో జూన్ 2013లో అరెస్టయ్యాడు జూలై 2013లో బెయిల్‌పై విడుదలయ్యాడు. ఈ కేసులో కీలక ప్రాసిక్యూషన్ సాక్షి, జియా తల్లి రబియా ఖాన్. ఇది ఆత్మహత్య కాదని, హత్యగా భావిస్తున్నట్లు కోర్టుకు తెలిపారు. ఈ కేసుపై తాజాగా దర్యాప్తు జరపాలంటూ ఆమె వేసిన పిటిషన్‌ను బాంబే హైకోర్టు గతేడాది కొట్టివేసింది. ఈ తీర్పుపై ఆమె స్పందిస్తూ.. తన కూతురు హత్యేనని పునరుద్ఘాటించారు. “ఆత్మహత్యకు ప్రేరేపించారనే అభియోగం పోయింది. అయితే నా బిడ్డ ఎలా చనిపోయింది? ఇది హత్య కేసు… హైకోర్టును ఆశ్రయిస్తాను” అని ఆమె వార్తా సంస్థ ANIకి చెప్పింది. జియా మరణానికి కారణం ఇంకా నిర్ధారించలేదంది. తీర్పు ప్రకారం ఆమె ఆత్మహత్య చేసుకున్నారంటున్నారు. కానీ జియా హత్యకు గురైందని నేను ఇప్పటికీ చెబుతున్నానన్నారు. ఇదే విషయం కేసును బలపరుస్తుందని ఆమె చెప్పారు. న్యాయమూర్తి ఏఎస్ సయ్యద్ గత వారం ఇరుపక్షాల తుది వాదనలు విని, ఈ కేసులో తీర్పును రిజర్వ్ చేశారు.

తొలుత కేసును ముంబై పోలీసులు విచారించారు. కేసు విచారణ సీబీఐకి అప్పగించడంతో జియా ఖాన్ రాసిన లేఖను ముంబై పోలీసుల నుంచి సీబీఐ స్వాధీనం చేసుకొంది. సూరజ్ పంచోలీ చేతిలో జియాఖాన్‌కు ఉన్న “సాన్నిహిత్యం, శారీరక వేధింపులు, ఆమె ఆత్మహత్యకు దారితీసినట్లు సీబీఐ నోట్‌లో తెలిపింది. ఏప్రిల్ 12, 2023న కోర్టుకు ఇచ్చిన చివరి వాంగ్మూలంలో, సూరజ్ పంచోలీ తనపై తప్పుడు కేసు నమోదు చేశారని, తప్పుడు ప్రాసిక్యూషన్ కారణంగా, తాను బాధితుడిగా మిగిలానన్నాడు. జియా మరణం గురించి విన్నప్పుడు తాను కుంగిపోయానని పేర్కొన్నాడు. “నా జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తిని, నేను నిజంగా ప్రేమించిన స్త్రీని కోల్పోయాను” అని చెప్పాడు. అమితాబ్ బచ్చన్ నటించిన “నిశబ్ద్”లో జియాఖాన్ మంచి గుర్తింపు తెచ్చుకుంది.