Home Page SliderTelangana

స్వలింగ వివాహాలకు సుప్రీం నో: మంచు లక్ష్మి షాక్

Share with

స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించే అధికారం కోర్టులకు లేదని సుప్రీంకోర్టు ప్రకటించిన విషయం తెలిసిందే. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలా? వద్దా? అనేది నిర్ణయించాల్సింది పార్లమెంట్ మాత్రమేనని తేల్చి చెప్పింది. దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న స్వలింగ వివాహాల చట్టబద్ధతపై ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది.

అయితే ఈ తీర్పుపై పలువురు సినీ సెలబ్రిటీలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఇదే అంశంపై టాలీవుడ్ నటి మంచు లక్ష్మి ట్విట్టర్ వేదికగా చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేసింది. స్వలింగ సంపర్కుల వివాహాన్ని చట్టబద్ధం చేయడానికి నిరాకరించిన సుప్రీం కోర్టు తీర్పుపై నిరాశతో తన గుండె పగిలిపోయిందని తెలిపింది. అన్నిరకాల ప్రేమలను స్వీకరించి.. మిగతా ప్రపంచానికి ప్రేమ గురించి బోధించే మన దేశానికి ఇది నిజంగా అవమానకరం. ఇతర దేశాల్లో స్వలింగ సంపర్కులు స్వేచ్ఛగా బతుకుతున్నారు… మనదేశంలో వీరి వివాహాలను అంగీకరించలేమా? అని మంచు లక్ష్మి ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌గా మారింది.

  ఇక స్వలింగ సంపర్కులు సహజీవనం చేయటం నేరం కాదంటూ 2018లో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించేలా స్పెషల్ మ్యారేజ్ యాక్ట్, ఫారిన్ మ్యారేజ్ యాక్ట్‌లో మార్పులు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో 18 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై సుదీర్ఘ వాదనల తర్వాత తీర్పు వెలువడింది. LGBT ల కోసం చట్టాలను మార్చడం కుదరదని ధర్మాసనం నొక్కి చెప్పింది.