NationalNews Alert

హిజాబ్‌పై సుప్రీం న్యాయమూర్తుల భిన్నాభిప్రాయాలు..

Share with

కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసిన హిజాబ్ వ్యవహారంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచార‌ణ జ‌రిగింది. ఈ అంశంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాల‌ను వినిపించారు. ధ‌ర్మాస‌నంలోని ఇద్ద‌రు న్యాయ‌మూర్తులు వేర్వేరు అభిప్రాయాల‌ను వ్య‌క్త‌ప‌రిచారు. క‌ర్నాట‌క ప్ర‌భుత్వ హిజాబ్ నిషేధ ఆదేశాల‌ను జ‌స్టిస్ హేమంత్ గుప్తా స్వాగ‌తించారు. ఇక ఆ ధ‌ర్మాస‌నంలో ఉన్న మ‌రో జ‌స్టిస్ సుధాన్షు దులియా మాత్రం ప్ర‌భుత్వ ఆదేశాల‌ను తోసిపుచ్చారు. ఈ కేసులో భిన్నాభిప్రాయం ఉంద‌ని, అందుకే అప్పీల్‌ను డిస్మ‌స్ చేస్తున్న‌ట్లు జ‌స్టిస్ హేమంత్ గుప్తా తెలిపారు. ఇక జ‌స్టిస్ దులియా మాత్రం అప్పీల్‌ను ఆమోదిస్తూ, క‌ర్నాట‌క ప్ర‌భుత్వ ఆదేశాల‌ను ర‌ద్దు చేశారు. అమ్మాయిల‌కు విద్య‌ను అందించ‌డమే త‌న‌కు ముఖ్య‌మైన విష‌య‌మ‌ని, అయితే హిజాబ్‌ను నిషేధించ‌డం వ‌ల్ల ఆ అమ్మాయిల జీవితాలు బాగుప‌డుతాయా అని జ‌స్టిస్ దులియా ప్ర‌శ్నించారు.

క‌ర్నాట‌క హిజాబ్ వివాదాన్ని ఇప్పుడు విస్తృత ధ‌ర్మాస‌నం విచారించ‌నున్న‌ది. భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్న నేప‌థ్యంలో… ఈ కేసును సీజేఐ ముందుకు తీసుకువెళ్తున్నామ‌ని ధ‌ర్మాస‌నం అభిప్రాయ‌ప‌డింది. హిజాబ్‌ను ధ‌రించ‌డం ఇస్లాం మ‌త‌ప‌రంగా అత్య‌వ‌స‌రం ఏమీ కాదు అని, కర్ణాటక ప్ర‌భుత్వ ఆదేశాలు స‌రిగ్గానే ఉన్న‌ట్లు జ‌స్టిస్ హేమంత్ గుప్తా తెలిపారు. ఆ కార‌ణాల చేత అప్పీల్‌ను డిస్మిస్ చేస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. క‌ర్నాట‌క హైకోర్టు ఈ కేసులో త‌ప్పుడు విధానంలో వెళ్లిన‌ట్లు జ‌స్టిస్ సుధాన్షు దులియా తెలిపారు.