Andhra PradeshHome Page Slider

67 సీట్లతో జేఈఈ అడ్వాన్స్‌డ్ లో ఎస్సీ విద్యార్థుల సత్తా

Share with

జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షల్లో ఎస్సీ గురుకుల విద్యార్థులు సత్తా చాటారని, వారు కనబరిచిన ప్రతిభ కారణంగా ఐఐటీ, ఎన్ఐటీ, నిఫ్ట్, సెంట్రల్ యూనివర్సిటీల్లో ఈ ఏడాది 67 సీట్లు రానున్నాయని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు. ప్రస్తుతం జేఈఈ అడ్వాన్స్ డ్ రాసిన విద్యార్థులు గతంలో కరోనా కాలంలో పరీక్షలు రాయకుండానే 9, 10 తరగతులు ఉత్తీర్ణులైన వారని వివరించారు. అయినప్పటికీ గతేడాది జేఈఈ అడ్వాన్స్ డ్ లో సాధించిన స్థాయిలోనే ఈ ఏడాది కూడా సీట్లను నిలుపుకోగలిగామని అన్నారు.

గతేడాది జేఈఈ అడ్వాన్స్ డ్ లో ఉన్న కటాఫ్ మార్కుల ఆధారంగా చూసినప్పుడు ఈ ఏడాది ఐఐటీల్లో 16, ఎన్ఐటీలలో 39, నిఫ్ట్, ఇతర సెంట్రల్ యూనివర్సిటీల్లో 12 చొప్పున మొత్తం 67 సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నామని తెలిపారు. ఈ మేరకు సోమవారం మీడియాకు ప్రకటన విడుదల చేశారు. ఇటీవల వెలువడిన నీట్ పరీక్షల్లోనూ ఎస్సీ గురుకుల విద్యార్థులు ఎంబీబీఎస్, డెంటల్ లో 44 సీట్లను సాధించే దిశగా సత్తా చూపిన విషయాన్ని మంత్రి ప్రస్తావించారు. ఉత్తమ ఫలితాలను సాధించడానికి కృషి చేసిన గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శ ఆర్. పావనమూర్తి, ఏఎంఓ ఎన్.సంజీవరావు, ఇతర అధ్యాపకులను ఈ సందర్భంగా అభినందించారు.