Andhra PradeshHome Page Slider

శ్రీశైల మల్లన్న తలపాగా.. దేవాంగ కులస్తులకు మహాదేవుని అరుదైన వరం

Share with


శ్రీశైలల మల్లన్నకు తలపాగాకు ఆ ఊరికి అవినాభావ సంబంధముంది. పరమశివుని పాలనేత్రాల నుంచి ఉద్భవించి… దేవతలకు వస్త్రాలకు తయారు చేయించిన దేవలమనుబ్రహ్మ వారసులు దేవాంగులకు అంతటి అరుదైన అవకాశం దక్కింది. మహాశివరాత్రి పర్వదినాన… శ్రీశైల మల్లన్నకు ప్రీతిపాత్రమైన తలపాగా కట్టే అదృష్టాన్ని ఆ కుటుంబం దక్కించుకుంది. కల్యాణ వేడుకకు ప్రధానంగా చేనేత మగ్గంపై పృధ్వి వంశీయులు నేసే తలపాగాను చుడతారు. ఇంతటి అవకాశం వారికి దక్కడం వారి పూర్వజన్మ సుకృతమని వారు భావిస్తారు. నిత్యం నియమనిష్టలతో స్వామివారి తలపాగా నేస్తారు. అసలు శ్రీశైల తలపాగా తయారీకి, పృధ్వి కుటుంబానికి దేవాంగులకు, చీరాల ప్రాంతానికి ఉన్న చరిత్ర ఓసారి తెలుసుకుందాం..

సృష్టి ఆరంభంలో మహాదేవుడు దేవతలకు వస్త్రాలు తయారు చేసేందుకు దేవల మనుబ్రహ్మను సృష్టిస్తాడు. అప్పటి వరకు జంతు చర్మాలను దేవతలు ధరించేవారు. దేవల మనుబ్రహ్మ సృష్టి తర్వాత వస్త్ర తయారీ ఆరంభమైంది. దేవల మనుబ్రహ్మ వారసులుగా దేవాంగులు ఖ్యాతిగడించారు. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో దేవాంగ కులస్తులు ఎక్కువగా ఉంటారు. ఆ దేవాంగ కులానికి చెందిన పృధ్వి కుటుంబీకులకు శ్రీశైల మల్లన్న తలపాగా ధరించే అవకాశం లభించింది. ఆ తలపాగాను చీరాల సమీపంలోని దేవాంగపురి, హస్తినాపురం వాస్తవ్యులు తయారు చేయడం అనాదిగా వస్తోంది.

శివరాత్రి సందర్భంగా పెళ్ళి కొడుకుగా ముస్తాబు చేయాలంటే ప్రకాశం జిల్లా చీరాల మండలం దేవాంగపురి హస్తినాపురానికి చెందిన ఓ సామాన్య చేనేత కుటుంబానికి చెందిన పృధ్వి వంశస్తులైన వెంకటేశ్వర్లు నేసిన తలపాగా ఉండాల్సిందే. ఈ ఆచారం గత మూడు తరాలుగా ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. ఈ తలపాగా తయారీకి ఏడాదంతా శ్రమించాల్సిందే. రోజుకు మూర చొప్పున 360 మూరలు చేనేత వస్త్రాన్ని తయారు చేస్తారు. దీనిని తయారుచేసే సమయంలో ఎంతో నియమనిష్టలతో ఉపవాసాలు ఉండి ఆస్వామి వారిని స్మరించుకుంటూ వెంకటేశ్వర్లుతో పాటు కుటుంబం మెత్తం ఈ నేత నేస్తారు. ఈ విధంగా నేసిన తలపాగాను శివర్రాత్రికి నాలుగు రోజుల ముందు గ్రామోత్సవం నిర్వహించి అనంతరం శ్రీశైలం తీసుకువెళతారు. శివరాత్రి రోజు జరిగే మల్లన్న కల్యాణానికి వరుడుగా తీర్చిదిద్దేందుకు తలపాగా అలంకరణ చేస్తారు.

లింగోద్భావ సమయంలో అర్ధరాత్రి 12 గంటలకు వెంకటేశ్వర్లు దిగంబరంగా 150 గజాలు ఉండే ఈ పాగా వస్త్రాన్ని గర్భాలయ శిఖరం నుండి నవనందులను కలుపుతూ అలంకరిస్తారు. ఈ విధంగా విశిష్టత కూడుకున్న ఈ వస్త్రాన్ని కల్యాణం అనంతరం వేలం వేస్తారు. దానిని దక్కించుకొనేదుకు ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన భక్తులు సైతం ఎంతో మంది పోటీ పడతారు. ఇంతటి విశిష్టత కల్గిన మల్లన్న కల్యాణనికి సంబంధించిన తలపాగా తయారు చేసే అవకాశం దక్కించుకున్న పృధ్వీ వంశస్తులు మూడుతరాలకు పైగా ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని పృధ్వి వెంకటేశ్వర్లు సుమారుగా 50 సంవత్సరాల నుండి వారసత్వంగా చేపడుతున్నారు. తలపాగా నేస్తూ శివరాత్రి ముందు రోజున శ్రీశైలం వెళ్లి ఆలయ లాంఛనాలతో ఆ వస్త్రాన్ని స్వామివారికి అలంకరిస్తున్నారు. కానీ ప్రస్తుతం వెంకటేశ్వర్లు అనారోగ్యానికి గురికావడంతో ఆయన కుమారుడు సుబ్బారావు ఆలయ లాంఛనాలతో పాగా అలంకరణ చేయనున్నారు. ఇటువంటి అరుదైన అవకాశం తమ ప్రాంతానికి దక్కడం పృధ్వి వంశస్తులకే కాక చీరాలకు కూడా మంచి గుర్తింపు లభించిందని గ్రామస్తులు అంటున్నారు.