Home Page SliderTelangana

పరుగులు పెడుతున్న పార్టీలు

Share with

వచ్చే నెల సరిగ్గా 30వ తేదీ ఇదే రోజు.. తెలంగాణ ప్రజానీకం ఓట్ల కోసం పోలింగ్ కేంద్రాల్లో క్యూ లైన్లు కట్టనున్న ప్రజలు. ఆలోపు వారిని ప్రసన్నం చేసుకునేందుకు పార్టీలు, అభ్యర్థుల ప్రయత్నాలు మొదలయ్యాయి. బరిలో నిలిపిన గుర్రాలను గెలుపుబాట పట్టించడానికి పార్టీలు పరుగులెత్తుతుండడంతో ప్రచారం ఉరకలెత్తుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల వేడి రగులుతోంది! ఈ సమయంలో ప్రధాన పార్టీల ప్రచార సరళిని చూస్తే..

    ఎన్నికల్లో అందరికంటే ముందు అభ్యర్థులను ప్రకటించిన అధికార పార్టీ బీఆర్ఎస్… ప్రచారంలోనూ ఇతరులకంటే కాసింత ముందంజలో ఉంది. తన ఎన్నికల మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కేసీఆర్ భరోసా అనే కొత్త స్లోగన్ వినిపించారు. ఈ పదేళ్లలో రాష్ట్రంలో జరిగిన డెవలప్‌మెంట్‌ని చూడండని వివరించడంతో పాటు.. అభివృద్ధి ఆగొద్దంటే, మేనిఫెస్టోలోని హామీలు ప్రజలకు అందాలంటే మరోసారి కేసీఆర్‌నే ముఖ్యమంత్రి చేయాలని ప్రజలకు అర్థమయ్యేలా చెబుతున్నారు.

ఆత్మీయ సమ్మేళనాలు.. బీఆర్ఎస్ అభ్యర్థులంతా పాదయాత్రలు చేస్తూ అన్ని వర్గాలతో ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో రైతులు, కూలీలు, మహిళా, యువజన, కుల సంఘాలతో సమావేశమవుతున్నారు. సాగుకు విద్యుత్, రైతుబంధు, రైతు బీమా, పింఛన్లు, దళిత, బీసీ బంధు, కంటివెలుగు పథకాలను వివరిస్తున్నారు. పట్టణాలు, నగరాల్లో… కాలనీలు, బస్తీల్లో స్థానికులు, వివిధ యూనియన్ల నాయకులతో భేటీలు నిర్వహిస్తున్నారు. అపార్టుమెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లోనూ సమావేశమవుతూ ఇళ్లకు నిరంతర కరెంట్, ఉచిత తాగునీరు, తగ్గించిన ఇంటి పన్నులు, స్థలాల క్రమబద్ధీకరణ, డబుల్ బెడ్‌రూం ఇళ్లు.. తదితరాలను గుర్తుచేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు పొందుతున్న లబ్ధిదారులను ఇంటింటికీ తిరిగి కలుస్తున్నారు. మరోసారి ఆశీర్వదించమని కోరుతున్నారు. 

వార్డులన్నింటిలో వాట్సప్ గ్రూపుల ఏర్పాట్లు – సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారానికి బీఆర్ఎస్ పెద్దపీట వేసింది. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిల్లో సామాజిక మాధ్యమ బృందాలను ఏర్పాటు చేసింది. ప్రతి బూత్‌లోని ఓటర్లందరితో కలిపి వాట్సప్ గ్రూపులను మొదలెట్టింది. మళ్లీ అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నారు? ఏ పథకం ఎవరికి ఉపయోగపడుతుంది? మహిళల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది? కొత్తగా ఎలాంటి పథకాలను రాబోయే రోజుల్లో తేబోతోంది, వాటిని ఎలా అమలు చేయబోతోందనే వివరాలను ఈ గ్రూపుల్లో పోస్ట్‌లుగా పెడుతున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పరిస్థితిని కూడా వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. అక్కడ రైతులకు విద్యుత్‌ను అందించడంలో విఫలమైందని పదే పదే గుర్తు చేస్తున్నారు. సరిహద్దు నియోజకవర్గాల నుండి కొందరు కర్ణాటక రైతులను తీసుకొచ్చి అక్కడి పరిస్థితిపై వారు ఎదుర్కొంటున్న సమస్యలను వారితోనే చెప్పిస్తున్నారు.