Home Page SliderTelangana

పీవీకి నివాళులర్పించిన రేవంత్ రెడ్డి, తమిళిసై

Share with

నేడు డిసెంబర్ 23 బహుభాషా కోవిదుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వర్థంతి. ఈ సందర్భంగా తెలంగాణ గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. హైదరాబాద్‌లోని పీవీ జ్ఞానభూమి వద్ద ఆయన సమాధిపై పుష్పగుచ్చం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. పీవీ నరసింహారావు దేశ ప్రధానిగా అందించిన సేవలను గుర్తు చేసుకుని, తెలుగు జాతి గర్వించదగిన మహనీయుడని కొనియాడారు. ఆయన కేవలం బహుభాషా కోవిదుడే కాక తెలుగు, హిందీ భాషలలో కవిత్వం రాసేవారు. సాహిత్యంపై ప్రత్యేక శ్రద్ధ కనపరిచేవారు. జ్ఞానపీఠ్ బహుమతి గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ గారు వ్రాసిన వేయిపడగలు నవలను సహస్రఫణ్ అనే పేరుతో హిందీలో అనువదించారు. అలాగే పలు మరాఠీ నవలలను తెలుగులోనూ, హిందీలోనూ కూడా అనువదించారు. వివిధ ప్రముఖ పత్రికలలో వ్యాసాలు రాసేవారు. ఆయన విదేశీ వ్యవహారాల మంత్రిగా ఉన్నప్పుడు బ్రిటన్, జర్మనీ, ఇటలీ, ఈజిప్టు వంటి దేశాలలో రాజకీయ అనుబంధ అంశాలపై ప్రసంగాలు చేసేవారు. 1980లో న్యూయార్క్‌లో జరిగిన 77 దేశాల సదస్సులో భారత్ తరపున నాయకత్వం వహించారు. ఆయన దేశానికి రక్షణ మంత్రిగా, విదేశీ వ్యవహారాల మంత్రిగా, మానవ వనరుల మంత్రిగా, న్యాయ,సమాచార మంత్రిగా, ఆరోగ్య శాఖ మంత్రిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పలు బాధ్యతలు స్వీకరించారు. చివరిగా ప్రధాని పదవిని అలంకరించారు.