Home Page SliderNational

రైల్వేకు సామాన్యుల గోడు పట్టదా?

Share with

సామాన్య ప్రయాణీకులపై రైల్వే సవతి ప్రేమ చూపిస్తోంది. పేదలు, సామాన్యులు ప్రయాణించే స్లీపర్ క్లాసు బోగీలను సగానికి పైగా తగ్గించేశారు. మనదేశంలో చాలామంది ప్రజలు రైలు ప్రయాణాలకే మక్కువ చూపిస్తారు. తక్కువ ధరలతో ఎక్కువ దూరం ప్రయాణించే రైలు ప్రయాణం ఇదివరకు అందరికీ అందుబాటులో ఉండేది. సీనియర్ సిటిజన్స్‌కు ఉండే రాయితీని ఏనాడో కరోనా కాలంలో తీసివేసి, ఇక దానిని పునరుద్దరించలేదు. కేవలం లాభార్జనే ధ్యేయంగా ప్రభుత్వ సంస్థ అయిన రైల్వే శాఖ పనిచేస్తోంది. దిగువ మధ్యతరగతి, పేద ప్రజలు ఏసీ చార్జీలు భరించలేరు. బోగీలు తక్కువైనా, రద్దీ ఎక్కువైనా, అతి కష్టంతో ప్రయాణాలు కొనసాగిస్తున్నారు.

ఇక తత్కాల్, ప్రీమియమ్ తత్కాల్ అంటూ ఎక్కువ సీట్లు వాటికే కేటాయిస్తున్నారు. వీటి ధరలు సాధారణ టిక్కెట్ రేటు కంటే రెండితలు, మూడింతలు ఎక్కువగా ఉంటున్నాయి. ఉదాహరణకు సికింద్రాబాద్ నుండి తిరుపతికి 400 స్లీపర్ టికెట్ అయితే తత్కాల్ 700 రూపాయలు, ప్రీమియం తత్కాల్ 1500 రూపాయల పైనే ఉంటోంది. ఇది దాదాపు ఏసీ టికెట్ రేటుకు సమానంగా, కొన్ని సందర్భాలలో మించిపోయి ఉంటోంది. మొక్కుబడిగా రెండు, మూడు స్లీపర్ క్లాసులు పెట్టి, మిగిలినవి ఏసీలుగా మారుస్తున్నారు.

ఇక బాత్‌రూమ్‌ల పరిమాణం చాలా తగ్గిపోయింది. చాలా ఇరుకుగా, మనిషి పట్టలేని స్థలం మాత్రమే కేటాయించారు. ఇక పరిశుభ్రత గాలికొదిలేశారు. ఏమాత్రం వాటిని క్లీన్ చేయడం లేదు. వాష్ రూమ్‌లలో తగినంత నీరు కూడా లభించడం లేదు. అదేమని ఎవరైనా ప్రశ్నిస్తే, పైనుండి వచ్చే ఆదేశాలను అమలు చేస్తున్నామని, తమ చేతుల్లో ఏదీ లేదని అంటున్నారు. ఇక జనరల్ బోగీలో ప్రయాణం అంటే నరకప్రాయమే. కనీసం కింద కూడా కూర్చోలేని స్థితి ఉంది. ఇకనైనా రైల్వేశాఖ కళ్లు తెరిచి సామాన్యప్రజల గోడు పట్టించుకుని పాత రాయితీలు పునరుద్ధరిస్తే ప్రజలకు మేలు జరుగుతుంది.