Home Page SliderNational

ప్రఖ్యాత నలందా యూనివర్సిటీని ప్రారంభించిన ప్రధాని నరేంద్రమోదీ

Share with

చరిత్రలో ప్రసిద్దికెక్కిన ప్రఖ్యాత నలందా యూనివర్సిటీకి పూర్వ వైభవం రానుంది. ప్రధాని నరేంద్రమోదీ నేడు నలందా యూనివర్సిటీ కొత్త క్యాంపస్‌ను ప్రారంభించారు. దీనిని గత నలందా యూనివర్సిటీ శిథిల కట్టడాలకు దగ్గరలోనే నిర్మించారు. చరిత్ర ప్రకారం నలందా విశ్వవిద్యాలయానికి 1500 సంవత్సరాల చరిత్ర ఉంది. దీనిని మొట్టమొదటగా క్రీ.శ.5వ శతాబ్దంలో నిర్మించారు. ఈ విశ్వవిద్యాలయానికి ప్రపంచం నలుమూలల నుండి విద్యార్థులు వచ్చేవారు. దాదాపు 800 సంవత్సరాల పాటు దీని వైభవం కొనసాగింది. మౌర్యుల కాలంలో దీని ఖ్యాతి ప్రపంచ వ్యాప్తంగా మారుమ్రోగింది. ఆర్థిక,రాజనీతి శాస్త్ర పితామహుడుగా పిలువబడే ఆచార్య చాణుక్యుడు నలందా విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా ఉండేవారు.  12 శతాబ్దంలో ఇది విదేశీ దండయాత్రల కారణంగా నాశనం చేయబడింది. అనంతర కాలంలో మొఘల పాలకులు గానీ,  బ్రిటిష్ పాలకులు గానీ దీనిని పునరుద్ధరించలేదు.

స్వాతంత్య్రానంతరం కూడా మనదేశ ప్రభుత్వాలు ఈ విశ్వవిద్యాలయానికి పూర్వపు వైభవం తెచ్చే ప్రయత్నాలు చేయలేదు. కానీ 2014లో నరేంద్రమోదీ ప్రధాని అయిన తర్వాత మన దేశ వైభవాన్ని, విజ్ఞానాన్ని ప్రపంచానికి చాటిన ఈ యూనివర్సిటీకి కొత్త రూపు తేవాలనుకున్నారు. 2014లో తాత్కాలిక భవనంలో కేవలం 14 మంది విద్యార్థులతో పునరుద్ధరింపబడింది నలందా యూనివర్సిటీ. కొత్త భవనం నిర్మాణం 2017లో మొదలయ్యింది. ఈ యూనివర్సిటీలో 6 విభాగాలు ఉన్నాయి. బుద్దిస్ట్ కళాశాలలు, సైకాలజీ, వివిధ మతాలకు సంబంధించిన చరిత్ర కళాశాలలు, ఎన్విరాన్‌మెంట్ స్టడీస్ వంటి విభాగాలతో 17 దేశాల నుండి 137 స్కాలర్‌షిప్ ప్రోగ్రాములతో అలరారుతోంది. వీటిలో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, భూటాన్, చైనా, ఇండోనేషియా, థాయ్‌లాండ్ వంటి దేశాలు కూడా భాగస్వాములై ఉన్నాయి. విదేశీ విద్యార్థులకు పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లు, పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లు కొత్తగా మొదలయ్యాయి. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు బీహార్ ముఖ్యమంత్రి నితిష్ కుమార్, కేంద్రమంత్రి జయశంకర్, బీహార్ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ పాల్గొన్నారు. 17 దేశాల నుండి వచ్చిన అంబాసిడర్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.