Andhra PradeshHome Page Slider

స్కాలర్‌షిప్ కుంభకోణంలో ప్రధాన నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష

Share with

హైదరాబాద్‌: సాంఘిక సంక్షేమ శాఖలో స్కాలర్‌షిప్‌లకు సంబంధించి 2003 లో నమోదైన కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు కె.వి.ఎల్. జయసింహ మినహా మిగిలిన వారిని నిర్దోషులుగా ప్రకటిస్తూ హైకోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. లేని కాలేజీలు ఉన్నట్లుగా చూపి, అందులో నకిలీ విద్యార్థుల పేర్లపై రూ.22 కోట్ల ఉపకార వేతనాలు స్వాహా చేయడంపై కేసు నమోదైంది. దీనిపై ప్రత్యేక కోర్టు విచారణ చేపట్టి పలువురిని నిర్దోషులుగా విడుదల చేసింది. మరికొంతమంది మృతి చెందగా.. మిగిలిన వారికి జైలుశిక్ష విధిస్తూ తీర్పు వెలువడింది. దీన్ని సవాలు చేస్తూ ప్రధాన నిందితుడు కె.వి.ఎల్. జయసింహ, 2వ నిందితుడు సంతోష్‌కుమార్, 4వ నిందితుడు వెంకటేశ్వరరావు, మోత్యానాయక్ తదితరులు హైకోర్టులో అప్పీళ్లు దాఖలు చేశారు. వీటిపై  విచారించిన జస్టిస్ కె.సురేందర్ తీర్పు వెలువరిస్తూ సంతోష్‌కుమార్, వెంకటేశ్వరరావు, మోత్యానాయక్ తదితరులను నిర్దోషులుగా పేర్కొన్నారు. ప్రధాన నిందితుడైన జయసింహ శిక్షను సవరిస్తూ.. ఒకరికి బదులు మరొకరిని చూపడం, ఫోర్జరీ, మోసాలపై మూడేళ్ల చొప్పున శిక్షను ఖరారు చేశారు.  అన్ని శిక్షలను ఏకకాలంలో అనుభవించాలని, ఇప్పటికే జైలులో ఉన్న కాలాన్ని మినహాయించాలని తీర్పులో పేర్కొన్నారు. ఈ కుంభకోణం కేసు దర్యాప్తు విధానాన్ని తప్పుబట్టారు. 13 కాలేజీలకు గుర్తింపు లేదంటూ ఉస్మానియా నుంచి తీసుకున్న వివరాలు మినహా ఇంటర్మీడియట్ బోర్డు తదితర సంస్థల వద్ద గుర్తింపు కోసం దరకాస్తు చేసుకున్న కాలేజీల వివరాలు సేకరించలేదన్నారు. పే అండ్ అకౌంట్స్‌ కార్యాలయంలో చెక్కులు జారీ చేయడానికి ఇతరులు కూడా సంతకాలు చేసినప్పటికీ కేవలం ఎ2 సంతోష్‌నే చేర్చారన్నారు. మిగిలిన సంతకాలను సరిపోల్చడం వంటివి దర్యాప్తు సంస్థ చేయలేదన్నారు. కేవలం ఊహలు, ఆరోపణల ఆదారంగా దర్యాప్తు జరిగిందన్నారు. విచారణ సమయంలో పత్రాలను సమర్పించినప్పటికీ ఒక్కోదానికి పొంతన లేదన్నారు. అందువల్ల నిందితులను నిర్దోషులుగా పేర్కొంటూ తీర్పు వెలువరించారు.