Andhra PradeshHome Page Slider

అధికారమే టార్గెట్ –టిడిపిలో గెలుపుగుర్రాలకే టికెట్లు

Share with

ఏపీలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అధికారాన్ని కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ అధినేత అడుగులు వేస్తున్నారు.ఈ నేపథ్యంలో కొన్ని నియోజకవర్గాలలో బలమైన అభ్యర్థులు కోసం కసరత్తులు ప్రారంభించారు.వచ్చే ఎన్నికల్లో మొహమాటానికి పోకుండా గెలుపు గుర్రాలకే టికెట్లు కేటాయించాలని చంద్రబాబు భావిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. శాసనసభ ఎన్నికల బరిలో నిలిచే ఆర్థిక, అంగ బలం ఉన్న అభ్యర్థుల కోసం జల్లెడ పడుతున్నట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో కుల సమీకరణలను సైతం పరిగణలోకి తీసుకోబోతున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేసే అభ్యర్థి ఏ మేరకు డబ్బు ఖర్చు చేయగలుగుతాడు, అతనికి టికెట్ ఇస్తే ఏ మేరకు ప్రభావం చూపుతాడు, ఆ అభ్యర్థి కుల ప్రభావం ఏ మేరకు ఉంటుంది, అనేది పరిగణలోకి తీసుకుంటున్నారని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు.

ఇప్పటికే ఇదేమి కర్మ, బాదుడే బాదుడు, భవిష్యత్తుకు గారెంటీ వంటి కార్యక్రమాలతో చంద్రబాబు నాయుడు ప్రజల్లో తిరుగుతుంటే ఆయన కుమారుడు నారా లోకేష్  యువగళం పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఆయా నియోజకవర్గాల వారీగా చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు నివేదికలకు తెప్పించుకుంటూ ఇన్చార్జిల పనితీరు పార్టీ స్థితిగతులపై పూర్తిస్థాయి దృష్టి కేంద్రీకరించారు. ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాల తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ,నియోజకవర్గాల ఇన్చార్జిలతో వ్యక్తిగతంగా చంద్రబాబు భేటీ అయి ఆయనకు అందిన నివేదికలకు ఆధారంగా వారికి దిశా నిర్దేశం చేశారు. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలంటూ అంతర్గతంగా దిశా నిర్దేశం కూడా చేశారు. దీంతో కొన్ని నియోజకవర్గాలలో నేతలు దూకుడు పెంచారు.

అయితే కొన్ని జిల్లాల్లోని నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ డీలా పడటం ఆ పార్టీ అధిష్టానాన్ని కలవరపెడుతుంది. మరికొన్ని నియోజకవర్గాల్లో మొక్కుబడిగా నేతలు వ్యవహరిస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వం పై ఉన్న వ్యతిరేకతను వివిధ కార్యక్రమాల ద్వారా క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకు వెళ్ళటంలో విఫలమైన నియోజకవర్గ ఇన్చార్జిలను తప్పించి వారి స్థానంలో కొత్త వారిని నియమించడానికి ఇప్పటికే  చంద్రబాబు కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. దీంతోపాటు కొన్ని నియోజకవర్గాల్లో నేతల మధ్య జరుగుతున్న అంతర్గత కుమ్ములాటలు చంద్రబాబుకు తలనొప్పిగా మారాయి. కొన్ని నియోజకవర్గాల్లో ఎవరికి వారే  తమకే టికెట్ అంటూ ప్రచారం చేసుకుంటూ కార్యకర్తలను గందరగోళానికి గురి చేస్తున్నారు. ఒకవేళ తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య ఎన్నికల పొత్తు కుదిరినట్లయితే ఎన్ని నియోజకవర్గాలను జనసేనకు కేటాయిస్తారన్నదానిపై కూడా ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. వీటంన్నిటిని అధిష్టానం దృష్టిలో ఉంచుకొని సమర్థవంతమైన వారిని అభ్యర్థులుగా ప్రకటించాలని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కోరుతున్నారు.