NewsTelangana

షేర్ మార్కెట్‌లా మునుగోడు రాజకీయాలు

Share with

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో షేర్ మార్కెట్ కంటే చాలా వేగంగా మునుగోడులో ఫిరాయింపులు జరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో ఇలాంటి ఫిరాయింపు రాజకీయాలను రూపుమాపడం యూత్ కాంగ్రెస్‌తోనే సాధ్యమన్నారు. మునుగోడు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన యూత్ కాంగ్రెస్ శిక్షణా తరగతుల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ.. ఉమ్మడి రాష్ట్రంలో యువజన కాంగ్రెస్‌కు మంచి స్పందన ఉండేదన్నారు.

ప్రస్తుతం తెలంగాణాలో సమస్యలపై పోరాడేందుకు దానికి  పూర్వ వైభవం తీసుకు రావాలన్నారు. తెలంగాణాలో కాంగ్రెస్‌ను అంతం చేయాలని ప్రత్యర్థి పార్టీలు కుట్రలు చేస్తున్నాయన్నారు. వారి కుట్రలను తిప్పి కొట్టాల్సిన బాధ్యత యూత్ కాంగ్రెస్‌పై ఉందని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో బడుగు,బలహీన వర్గాల వేదిక కాంగ్రెస్ అని రేవంత్ తెలిపారు. ఈ వేదికను తొలగించి రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని మట్టు పెట్టాలని అందరూ చూస్తున్నారన్నారు.

దళిత,బహుజనులు టీఆర్‌ఎస్‌లో అధ్యక్షుడు అయ్యే అవకాశం ఎప్పటికీ ఉండదన్నారు. కేసీఆర్ కలలో కూడా అటువంటి ఆలోచన చేయరన్నారు. కాంగ్రెస్ పార్టీ పేదల సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్న పార్టీ అన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ లేకుంటే అన్నీ రాష్ట్రాలలోని పేదలు బానిసలుగా బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. కాబట్టి మనమందరం కాంగ్రెస్ పార్టీని బ్రతికించాలని రేవంత్ పిలుపునిచ్చారు. ప్రస్తుతం మునుగోడు గడ్డపై కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని రేవంత్ కోరారు.