Home Page SliderTelangana

చరిత్రను తప్పుగా చూపించేవారికి.. ప్రజలే సరైన సమాధానం చెబుతారు- అమిత్ షా

Share with

  • సంతుష్టీకరణ కోసం వాస్తవాలను మరుగున పడేస్తే చరిత్ర ఉండదన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా
  • దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా.. ఆ తర్వాత 399 రోజులపాటు తెలంగాణలో రజాకార్ల అరాచకం పెరిగింది
  • మన పూర్వీకులు కలలుగన్న తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా పనిచేద్దామని పిలుపు
  • తెలంగాణ ప్రజల స్వాతంత్ర్య దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం ప్రధాని మోదీ ఆలోచన అని వెల్లడి
  • అనేకానేక బలిదానాలు చేసి సంపాదించుకున్న స్వాతంత్ర్యం.. విమోచనమే కానీ సమైక్యత కాదన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
  • తెలంగాణ చరిత్రను పాతరేసేందుకు.. కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించిదని వెల్లడి
  • కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పరేడ్ గ్రౌండ్స్‌లో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమం
  • షోయబుల్లాఖాన్, రాంజీ గోండుల స్మారకంగా..స్పెషల్ పోస్టల్ కవర్ ఆవిష్కరించిన అమిత్ షా

తెలంగాణ చరిత్రను తప్పుగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్న వారిని.. ఇన్నాళ్లు చరిత్రను మరుగుపడేసేందుకు ప్రయత్నించిన వారికి ప్రజలే సరైన సమాధానం చెబుతారని కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా పేర్కొన్నారు. తెలంగాణకు స్వాతంత్ర్యం రాకుండా స్వతంత్ర్య రాజ్యంగా ఉంటే.. భారతమాత కడుపులో కేన్సర్ ఉన్నట్లేనని గుర్తించిన సర్దార్ వల్లభాయ్ పటేల్.. తెలంగాణను రజాకార్లనుంచి విముక్తి చేయించేందుకు నడుం బిగించారన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన హైదరాబాద్ సంస్థాన విమోచనోత్సవాల సందర్భంగా.. జాతీయ జెండాను ఎగురవేసి కార్యక్రమాన్ని అమిత్ షా ప్రారంభించారు.

తెలంగాణ విముక్తి పోరాటంలో ప్రాణత్యాగం చేసిన వీరులకు అమిత్ షా వందనాలు, శ్రద్ధాంజలి అర్పించారు. సర్దార్ పటేల్ లేకపోతే.. తెలంగాణకు ఇంత త్వరగా విముక్తి లభించకపోయేదన్నారు. దేశాన్ని ఐక్యం చేసే నినాదంతోనే పోలీసు చర్యలకు ఆయన సిద్ధమయ్యారన్నారు. మిలటరీ సైన్యం ‘ఆపరేషన్ పోలో’ ప్రారంభించిన తర్వాత.. రక్తం చుక్క చిందకుండానే.. నిజాం మెడలు వంచి తెలంగాణ స్వాతంత్ర్యం సిద్ధించిందన్నారు. కేఎం మున్షీ నేతృత్వంలో, పటేల్ ఆదేశాలతో ఈ ఆపరేషన్ జరిగిందని.. ఈ సందర్బంగా వారిద్దరీ ఘనంగా నివాళులు అర్పిస్తున్నానని అమిత్ షా అన్నారు.

తెలంగాణ స్వాతంత్రోద్యమంలో.. ఆర్యసమాజ్, హిందూ మహా సభ వంటి ఎన్నో సంస్థలు పనిచేశాయని.. ఉస్మానియా యూనివర్సిటీలో వందేమాతర నినాదంతో నిజాం గుండెల్లో రైళ్లు పరిగెట్టాయని అమిత్ షా గుర్తుచేశారు. 75 ఏళ్ల వరకు దేశంలోని ఏ ప్రభుత్వం కూడా.. మన యువతకు తెలంగాణ స్వాతంత్ర్య పోరాటాన్ని గురించి చెప్పేందుకు ప్రయత్నించలేదని, ఈ పోరాటానికి సరైన గౌరవాన్ని అందించడంతోపాటు.. తెలంగాణ భవిష్యత్ తరాలకు స్ఫూర్తినందించే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. అధికారికంగా ఈ ఉత్సవాలను నిర్వహించేందుకు ఆదేశించారన్నారు. మన పెద్దల పోరాటాన్ని స్మరించుకోవడం, వారు కలలుగన్న రాష్ట్రాన్నినిర్మించుకోవడమే కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాల లక్ష్యమన్నారు. స్వాతంత్ర్య పోరాటం స్ఫూర్తితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.

ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసిన అమిత్ షా.. ప్రపంచవ్యాప్తంగా దేశ గౌరవాన్ని ఇనుమడింపజేసేలా ప్రధాని మోదీ కృషిచేస్తున్నారని అన్నారు. దీని ఫలితంగానే.. నేడు దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచలోనే 5వ స్థానానికి చేరిందని, జీ20 ద్వారా భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచానికి మరోసారి తెలియజేశామని అమిత్ షా వెల్లడించారు. నేడు ప్రపంచమంతా భారతదేశం సాధిస్తున్న ప్రగతిని ప్రశంసిస్తోందన్నారు.

పరకాలలో 1500 మంది జాతీయ జెండాను ఎగరేసినందుకు జలియన్ వాలాబాగ్ తరహాలో వారిపై కాల్పులు జరిపారని, ఇందులో పలువురు అమరులవగా.. మరికొందరు గాయపడ్డారన్నారు. ఇదే తరహాలో మహారాష్ట్రలోని పర్భణిలో, కర్ణాటకలోని బీదర్ లోనూ సామాన్య జనాలపై కాల్పులు జరిగాయన్నారు. వీటి నుంచివిముక్తి కల్పించేందుకు ఆగస్టు 10, 1948 నాడు పటేల్ సంకల్పించారని.. సెప్టెంబర్ 17 నాటికి మిషన్ పూర్తిచేశారని అమిత్ షా అన్నారు. ఈ సందర్భంగా.. సశస్త్ర సీమాబల్ అధికారుల నివాస సముదాయాలను వర్చువల్ గా అమిత్ షా ప్రారంభించారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని.. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా.. బొల్లారంలోని రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్ ను కూడా అమిత్ షా వర్చువల్ గా ప్రారంభించారు. తెలంగాణ స్వాతంత్రోద్యమ వెలుగు దివిటీలు షోయబుల్లాఖాన్, రాంజీ గోండుల స్మారక స్పెషల్ పోస్టల్ కవర్‌ను అమిత్ షా ఆవిష్కరించారు.

అంతకుముందుకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ పోరాట, స్ఫూర్తివంతమైన చరిత్రను పాతరేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించిందని.. దీన్ని తెలంగాణ ప్రజలు క్షమించరన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ కూడా చరిత్రను ప్రజల స్మృతిపథం నుంచి చెరిపేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా.. తెలంగాణ ప్రజలు స్వేచ్చావాయువులు పీల్చుకోలేక పోవడం కారణంగానే.. సర్దార్ పటేల్ మిలటరీ యాక్షన్ కు ఆదేశించారన్నారు. ఎందరో మంది ప్రజల త్యాగం, అలుపెరగని పోరాటం కారణంగా సాధించుకున్న తెలంగాణ స్వాతంత్ర్యం.. విమోచనమే అవుతుంది తప్ప.. సమైక్యత ఎలా అవుతుందని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.

రజాకార్ల జమానాలో.. మహిళలపై ఆకృత్యాలు, మానభంగాలు, నగ్నంగా మహిళలో బతుకమ్మ ఆడించిన ఘటలను నా తెలంగాణ సమాజం ఎలా మరిచిపోవాలని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణలో ప్రతి గ్రామానికి రజాకార్లపై పోరాడిన చరిత్ర ఉందని, 75 ఏళ్లపాటు ఈ చరిత్రను తొక్కిపెట్టే ప్రయత్నం చేశారని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఉత్సవాల నిర్వహణ ద్వారా మళ్లీ మన చరిత్రకు పూర్వవైభవం కల్పిచడంతోపాటుగా.. జనాలందరికీ మన వాస్తవ చరిత్రను తెలియజేసే ప్రయత్నం చేస్తోందన్నారు. ఈ సందర్భంగా కేంద్ర సాయుధ బలగాలు, నిజాం సంస్థానంలోని ప్రస్తుత మూడు రాష్ట్రాల సంస్కృతిని ప్రతిబింబించే కళాకారుల పరేడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో కేంద్ర హోం శాఖ, సాంస్కృతిక శాఖ కార్యదర్శుల, సీఆర్‌పీఎఫ్, సశస్త్ర సీమాబల్ డీజీలు, సాంస్కృతిక శాఖ సంయుక్త కార్యదర్శితోపాటుగా తెలంగాణ విమోచనోద్యమంలో పాల్గొన్న సమరయోధులు, దివ్యాంగులు, తెలంగాణలోని రాజకీయ, వివిధ రంగాల ప్రముఖులు, పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.