Home Page SliderNational

కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎన్ని సీట్లొస్తాయో చెప్పిన పీసీసీ చీఫ్ డీకే

Share with

ఇండియా టుడే టీవీ మేనేజింగ్ ఎడిటర్ రాజ్‌దీప్ సర్దేశాయ్‌కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో… రాబోయే కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుందో తేల్చి చెప్పారు ఆ పార్టీ చీఫ్ డీకే శివకుమార్. మే 10న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ 141 సీట్లు గెలుచుకుంటుందని ఆయన జోస్యం చెప్పారు. కర్నాటకలో 224 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా… ప్రభుత్వాన్ని ఏర్పాటుకు కావాల్సిన 113 మంది సభ్యులకంటే ఎక్కువ సీట్లను కాంగ్రెస్ గెలుచుకోబోతుందని ఆయన స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికలు హస్తం పార్టీకి దిక్సూచిగా నిలుస్తాయని చెప్పుకొచ్చారు.

కర్నాటకలో పూర్తి మెజారిటీతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని విశ్వాసం ఉందన్నారు. హంగ్ ఎలక్షన్ విషయంలో జేడీఎస్‌తో జట్టుకట్టాల్సిన అవసరం ఉండబోదని దీమా వ్యక్తం చేశారు. హంగ్ అసెంబ్లీ రానేరాదన్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితాను గురువారం పార్టీ విడుదల చేసింది. ఇప్పటి వరకు 166 మంది అభ్యర్థులను ఆ పార్టీ ప్రకటించింది. ప్రకటించిన అభ్యర్థుల విషయంలో అందరూ ఏకాభిప్రాయంతో అభ్యర్థిత్వాలను ఆమోదించారన్నారు డీకే. తనకు, పార్టీ సీనియర్ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్యకు మధ్య ఎలాంటి విభేదాల్లేవని… అభ్యర్థుల విషయంలో పలానా వారు కావాలన్నదానిపై రెండు వైపుల నుంచి విభేదాలున్నా… గెలిచే కాంగ్రెస్ అభ్యర్థులకు మాత్రమే టికెట్లు లభిస్తాయన్నారు.

పార్టీ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా తనను తాను ప్రొజెక్ట్ చేస్తారా అని అడిగ్గా… పార్టీ హైకమాండ్ తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. అయితే తనకు అవకాశం వస్తే స్వాగతిస్తానని, అందరూ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారని ఉన్న విషయాన్ని చెప్పారు డీకే. మే 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, మే 13న ఫలితాలు వెల్లడికానున్నాయి. డీకే శివకుమార్ కనకపుర అసెంబ్లీ స్థానం నుంచి బరిలో నిలుస్తున్నారు.