Andhra PradeshHome Page Slider

టీడీపీ-జనసేన పొత్తుకు కారణం ముమ్మాటికీ జగనే-పవన్ కల్యాణ్ స్పష్టీకరణ

Share with

జనసేనాని, టీడీపీ మధ్య పొత్తును ప్రకటించారు జనసేనాని పవన్ కళ్యాణ్. జనసేనాని, నారా లోకేష్, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇవాళ రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబును కలిశారు. చంద్రబాబు అరెస్ట్ సరైనది కాదని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం కలిసి పోటీ చేస్తాయని ఈరోజు నేను నిర్ణయం తీసుకున్నాను. ఇది మా రాజకీయ భవిష్యత్తు గురించి కాదు.. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించి అని పవన్ కల్యాణ్ అన్నారు. టీడీపీ అధినేత కనీసం సోమవారం వరకు జైల్లో ఉండాల్సిన పరిస్థితి నేపథ్యంలో ముగ్గురు నేతలు ఇవాళ చంద్రబాబును జైలులో కలిశారు.

రాష్ట్రంలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇక ఎంత మాత్రం భరించలేమన్నారు. క్రిమినల్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్‌ను ఏవిధంగా సమర్థించుకుంటారని విరుచుకుపడ్డారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తి… దేశం నుండి బయటకు వెళ్లడానికి కూడా అనుమతి అవసరమైన వ్యక్తి అంటూ సీఎం జగన్మోహన్ రెడ్డిపై మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేదని, దోచుకుంటున్నాడని.. మద్యం నుండి డబ్బు సంపాదిస్తున్నాడని… రాజ్యాంగ విరుద్ధమైన కార్యకలాపాలను కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. రాజకీయపగతో చంద్రబాబును అరెస్ట్ చేశారని, వైసీపీ సర్కారు తీరు వల్లే ఇవాళ చంద్రబాబుకు అండగా నిలుస్తున్నానన్నారు. చంద్రబాబుతో భేటీ తర్వాత పవన్ కల్యాణ్ ఆయన సతీమణి నారా భువనేశ్వరిని కలిశారు.

ఆదివారం చంద్రబాబు నాయుడును రెండు వారాల జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. మంగళవారం అవినీతి నిరోధక న్యాయస్థానం భద్రతాపరమైన సమస్యలను ఉదహరించడంతో హౌస్ కస్టడీ అభ్యర్థనను తిరస్కరించింది. బుధవారం ఆంధ్రప్రదేశ్ పోలీస్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ ఈ కేసులో ప్రధాన నిందితుడు చంద్రబాబు అంటూ ఆరోపణలు గుప్పించింది. ప్రాజెక్ట్ మొత్తం అంచనా ₹ 3,300 కోట్లతో రాష్ట్రంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) క్లస్టర్‌ల ఏర్పాటుకు సంబంధించినది, అయితే దీని వల్ల రాష్ట్రానికి ₹ 300 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని సీఐడీ ఆరోపిస్తోంది. ప్రైవేట్ సంస్థల ద్వారా ఏదైనా ఖర్చు చేయడానికి ముందే… ప్రభుత్వం ₹ 371 కోట్ల అడ్వాన్స్‌గా చెల్లించిందని… సీఐడీ చెప్తోంది. ఈ మొత్తం వ్యవహారం చంద్రబాబు కనుసన్నల్లోనే జరిగిందని సీఐడీ వివరిస్తోంది.